బక్రీద్, బోనాల నిర్వహణలో అప్రమత్తతో ఉండాలి
*బోనాలు, బక్రీద్ పండుగలను ప్రశాంతంగా నిర్వహించాలి – డి.జి.పి మహేందర్ రెడ్డి*
త్వరలో బక్రీద్, బోనాలు తదితర పండుగలను ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా, శాంతియుతంగా జరిగే విధంగా తగు చర్యలు చేపట్టాలని డి.జి.పి ఎం. మహేందర్ రెడ్డి ఆదేశించారు. కోవిడ్ కారణంగా గత సంవత్సరంన్నర కాలంగా రాష్ట్రంలో ప్రధాన పండుగల నిర్వహణ జరగలేదని, లాక్ డౌన్ పూర్తిగా సడలించిన నేపథ్యంలో తిరిగి ఈ పండుగల నిర్వహణ పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉందని అన్నారు. ఈ నెలలో గోల్కొండ బోనాలు, బక్రీద్ పండుగ, ఉజ్జాయిని మహంకాళి బోనాలు, వచ్చే నెల పాత బస్తీ బోనాలు జరుగనున్నాయని అన్నారు. రెండు పండుగలు ఒకే సారి వస్తున్నందున ఏవిధమైన అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అప్రమత్తతతో ఉండాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రధానంగా బక్రీద్ పండుగ సందర్భంగా పశువుల రవాణా విషయంలో అవసరమైన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఆవులు, దూడలను రవాణా చేసేవారిపై కఠిన చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను డి.జి.పి ఆదేశించారు. పశువులను రవాణాచేసే ప్రతి వాహనానికి తగు నిర్థారిత ప్రమాణిక పత్రాలు (వాలిడ్ డాక్యుమెంట్స్) ఉండాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో పోలీసు, పశుసంవర్థక శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ప్రతి జిల్లాలు, ఇతర రాష్ట్రాల సరిహద్దుల్లో ప్రత్యేక చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేయాలని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుండి రవాణా అయ్యే పశువుల విషయంలోనూ నియమ, నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. పశుసంవర్ధక శాఖతో సమన్వయం చేసుకుంటూ గోవుల అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. సరైన పత్రాలు వారి వెంట ఉన్నాయనే విషయాన్ని పరిశీలించి అనుమతించాలని అన్నారు. జిల్లాల సరిహద్దులు, జిల్లా కేంద్రాలలో చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని తెలిపారు. పండుగల సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమాల ద్వారా విద్వేషాలు, రెచ్చగొట్టే పోస్టింగులు పెట్టే వారిని గుర్తించి అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.