బీజేపీ వైపు… బిఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ చూపు..?
~ మాజీ కార్పొరేటర్ కేఎం. గౌరీష్ కమలం గూటికి చేరనున్నరా…?..
~ కుత్బుల్లాపూర్ డివిజన్ లో బలంగా వినిపిస్తున్న గుసగుసలు….
~ ఆ దిశగా పావులు కదుపుతున్నట్లు సంకేతాలు …
~ ఇప్పటికే ఎంపీ ఈటలతో పాటు స్థానిక బీజేపీ నాయకులతో భేటీ
~ త్వరలోనే బీజేపీ కండువా కప్పుకోవడం ఖాయంగా సమాచారం
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 21 : కుత్బుల్లాపూర్ డివిజన్ లో కమలం వికసించనుందా..? బీజేపీకి మరింత బలం చేకూరనుందా..? డివిజన్ లోని మాజీ కార్పొరేటర్ కారు దిగి కమలాన్ని అందుకోనున్నారా..? ఆ దిశగా పావులు కదుపుతున్నారా….? అంటే అవుననే సంకేతాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి… వినిపిస్తున్నాయి కూడా. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం, పార్లమెంటు ఎన్నికల్లో కనీసం ఒక్క స్థానాన్ని కూడా కైవసం చేసుకోకపోవడం వంటి పరిణామాలతో బీఆర్ఎస్ పార్టీ పనైపోయిందనుకునే కొందరు నాయకులు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. దీనిలో భాగంగానే పార్టీ కండువా మార్చుకునేందుకు తెర వెనుకాల మంతనాలు జరుపుతున్నారు. అలాగే ఇప్పటి వరకు వెన్నంటి ఉన్న కార్యకర్తలు, అభిమానులు, అనునయులను తాము పార్టీ మారే విషయంలో ఒప్పించే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే కుత్బుల్లాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వరరావు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ గూటికి చేరగా… గాజులరామారం డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ రావుల శేషగిరి పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ కండువా కప్పుకోగా… బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయుకుడు, కుత్బుల్లాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కేఎం. గౌరీష్ కూడా ఈ కోవకు చెందుతారనే గుసగుసలు డివిజన్ లో చక్కర్లు కొడుతున్నాయి. కాగా… ప్రస్తుతం గౌరీష్ సతీమణి కూన గౌరీష్ పారిజాత కుత్బుల్లాపూర్ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ గా ఉన్నారు.
• బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి కేఎం. గౌరీష్…?
కుత్బల్లాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కేఎం. గౌరీష్ బీజేపీ పార్టీలో చేరేందుకు
పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది. కమలం గూటికి చేరేందుకు ఇప్పటికే మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ను కూడా కలిసినట్లు సమాచారం. అంతే కాకుండా స్థానికంగా ఉన్న బీజేపీ నాయకులను స్వయంగా, ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపినట్లు విశ్వసనీయ సమాచారం. అలాగే బీఆర్ఎస్ పార్టీలో తన వెన్నంటి ఉన్న క్యాడర్ తో పాటు పలు కాలనీలు, బస్తీల సంక్షేమ సంఘ ప్రతినిధులు, పరిచయం ఉన్న వారితో కూడా సంప్రదించి వెంట రావల్సిందిగా కోరినట్లు తెలుస్తుంది.
• మరి క్యాడర్ కలిసొచ్చేనా..?
కేఎం. గౌరీష్ బీజేపీలో చేరనున్నట్లు క్యాడర్ కు తెలిపి తన వెంట రావల్సిందిగా వారిని కోరినా…పలువురు విముఖత
వ్యక్తం చేసి, తాము బీఆర్ఎస్ లోనే ఉంటామని తెలిపినట్లు సమాచారం. తామంతా కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ వెంటే ఉంటామని, తాము పార్టీ మారే ప్రసక్తే లేదనే విషయాన్ని పలువురు స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. పదేళ్లు బీఆర్ఎస్ అధికారం అనుభవించి స్వయాన తన అన్న (కేఎం. పాండు) కొడుకు కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా (కేపీ వివేకానంద్) ఉన్నా కూడా తన స్వలబ్ధి కోసం పార్టీ మారే అలోచనలో ఆయన ఉన్నారనే గుసగుసలు బలంగానే వినిపిస్తున్నాయి. ఏదీ ఏమైనప్పటికీ మాజీ కార్పొరేటర్ కేఎం. గౌరీష్ త్వరలోనే బీజేపీ కండువా కప్పుకోవడం తథ్యంగానే తారసపడుతుంది. ముహూర్తం ఖరారయ్యే వరకు వేచి చూడాల్సిందే.. రాజకీయ పరిణామాలు ఎటు మారుతాయో.