వారణాసిలో శివలింగార్చనకు కుత్బుల్లాపూర్ లో శ్రీ కోటి పార్థివ శివలింగాలు…
~ శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయంలో సిద్ధం చేస్తున్న మహిళలు
~పవిత్రంగా పుట్టమన్నుతో పార్థివ శివలింగాల తయారీ
~ కార్తీక మాసంలో వారణాసిలో తొమ్మిది రోజుల పూజలు అనంతరం గంగానదిలో నిమర్జన
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 18 : నిత్యం పుట్ట మన్నుతో శివలింగాల తయారీ, శివనామస్మరణలతో కుత్బుల్లాపూర్ గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం మరో కైలాసాన్ని తలపిస్తుంది. పదుల సంఖ్యలో మహిళలు దేవాలయానికి చేరుకొని భక్తిశ్రద్ధలతో అత్యంత పవిత్రంగా పార్థివ శివలింగాలను ఓ యజ్ఞంలా తయారు చేస్తున్నారు. రానున్న కార్తీక మాసాన్ని పురస్కరించుకొని శ్రీ కాశీ అవిముక్త మహా క్షేత్రంలో గురువులు బ్రహ్మశ్రీ డాక్టర్ సామవేదం షణ్ముఖ శర్మ ఆశీస్సులతో తలపెట్టిన శ్రీ కోటి పార్థివ శివలింగార్చనకు శ్రీ సాంబ సదాశివ మహాదేవ సేవా సమితి, గోలి అశోక్ గుప్తా వారణాసి ఆధ్వర్యంలో ఇక్కడ పుట్టమన్నుతో శివలింగాలను సిద్ధం చేస్తున్నారు.
శ్రీ కోటి పార్థివ లింగార్చనతో పాటు శ్రీ లక్ష్మీ మహాగణపతి, కాలభైరవ, రుద్ర, చండీ,వారాహి శ్రీవిద్య, 28 నక్షత్ర ఆదిత్యాది నవగ్రహ హవనములు, ప్రతి నిత్యము లక్ష బిల్వార్చనలు, తొమ్మిది రోజులు పాటు గురువుచే శ్రీ కాశీ క్షేత్ర వైభవ ప్రవచన యజ్ఞం, శివపదగానోత్సవం మొదటి కార్తీక సోమవారం శుద్ధ తదియ నవంబర్ 4వ తేదీ నుంచి ప్రారంభమై నవంబర్ 13 వ తేదీ కార్తీక శుద్ధ క్షీరాబ్ది ద్వాదశి బుధవారం వరకు పూజలు నిర్వహించి, పూర్ణాహుతి సమర్పించనున్నారు. అనంతరం భక్తులచే పూజలు అందుకున్న శ్రీ కోటి పార్థివ లింగాలను అదే రోజు గంగా నదిలో నిమజ్జనం చేయనున్నారు.
ఇంతటి పవిత్ర పుణ్య కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారికి, కాశీలో గర్భావాసం చేయాలనుకునే భక్తులకు ఇది మంచి సదావకాశమని, ప్రతి ఒక్కరూ దీనిని సద్వినియోగం చేసుకొని ఆ ఈశ్వరుడు కృపకు పాత్రులు కాగలరని కార్యవర్గ సభ్యులు చిన్న రామయ్య గారి రమేష్ గుప్తా సూచించారు. మరింత సమాచారం కోసం సెల్ నెంబర్ 9290888386 నెంబర్ పై సంప్రదించాలని ఆయన తెలిపారు.