వేర్వేరు ప్రాంతాల్లో భార్యాభర్తలు ఇరువురు ఉరి వేసుకుని ఆత్మహత్య
~ హెచ్ఎంటి అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకొని భర్త…
~ ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరివేసుకొని భార్య ఆత్మహత్య
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి),:జూన్ 8: భార్యాభర్తల మధ్య తరచు వివాదాలతో మనస్పర్ధలకు గురై ఒకరి తర్వాత ఒకరు వేరు వేరు ప్రాంతాల్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జీడిమెట్ల, జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ల పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గాజులరామారం లోని ద్వారకా నగర్ కు చెందిన మంచూరి రేశ్వంత్ (26), 2021 లో సాయి శ్రీయ (24) ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల వారిద్దరూ తరచూ గొడవలు పడడంతో మనస్పర్ధలు నెలకొన్నట్లుగా తెలుస్తుంది. దీంతో రేశ్వంత్ చింతల్ లోని హెచ్ఎంటి అటవీ ప్రాంతంలో ఓ చెట్టుకు చున్నీతో ఉరివేసుకొని, సాయి శ్రీయ ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని శనివారం ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు రేశ్వంత్ ఉరి వేసుకున్న విషయాన్ని మధ్యాహ్నం 3 గంటలకు ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో అక్కడికి చేరుకున్న రేశ్వంత్ సోదరుడు సాయి చంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భార్యాభర్తల ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
అయితే… రేశ్వంత్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న హెచ్ఎంటి అటవీ ప్రాంతం జీడిమెట్ల పీఎస్ పరిధిలోకి, సాయి శ్రీయ ఆత్మహత్య చేసుకున్న ద్వారకా నగర్ ప్రాంతం జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలోకి వస్తుంది. ఈ నేపథ్యంలో రేశ్వంత్ ఆత్మహత్య కు సంబంధించి జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు అందింది. కానీ… సాయి శ్రీయ ఆత్మహత్యకు సంబంధించి ఏ ఫిర్యాదు జగద్గిరిగుట్ట పోలీసులకు ఇప్పటి వరకు అందనట్లు సమాచారం.