శ్రీ చైతన్య పాఠశాలకు అనుమతులు జారీ చేయొద్దని ఎమ్మెల్యేకు వినతి
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 8: ఎటువంటి అనుమతులు తీసుకోకుండా నిబంధనకు విరుద్ధంగా సుచిత్రలోని దుర్గా ఎస్టేట్ మూడు గుళ్ల సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ చైతన్య పాఠశాలపై తగిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే కుత్బుల్లాపూర్ మండల విద్యాధికారి, కుత్బుల్లాపూర్ సర్కిల్ ఉప కమిషనర్ తో పాటు మేడ్చల్ జోన్ ట్రాఫిక్ ఏసీపీలకు కుత్బుల్లాపూర్ లోని బడ్జెట్ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాల సంఘం ప్రతినిధులు వినతి పత్రం అందించిన విషయం తెలిసిందే. తాజాగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ను తన నివాస కార్యాలయంలో వారు కలిసి శనివారం మరోమారు ఫిర్యాదు చేశారు. సుచిత్ర లోని సెయింట్ ఆంథోనీ పాఠశాలకు సమీపంలోనే శ్రీ చైతన్య పాఠశాలను నిబంధన విరుద్ధంగా ఏర్పాటు చేస్తున్నారని, ఇప్పటికే పలు ఫిర్యాదుల మేరకు సదరు పాఠశాలను సీజ్ చేశారని, ఇకపై కూడా శ్రీ చైతన్య పాఠశాల కు ఎటువంటి అనుమతులు ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే జిల్లా విద్యాశాఖ అధికారికి ఫోన్ చేసి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన శ్రీ చైతన్య పాఠశాల వల్ల సుమారు 40 బడ్జెట్ పాఠశాలలకు ఇబ్బంది కలుగుతుందని, దానిని దృష్టిలో పెట్టుకొని సదరు పాఠశాలకు ఎటువంటి అనుమతులు మంజూరు చెయ్యొద్దని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ మండల గుర్తింపు పొందిన పాఠశాలలో యాజమాన్యాల సంఘం అధ్యక్షులు మహేష్ కుమార్, కార్యదర్శి రవికుమార్, కోశాధికారి గోవర్ధన్ రెడ్డి, చైర్మన్ పి. శివయ్య, వైస్ చైర్మన్ మండవ శ్రీనివాస్ గౌడ్, మాజీ అధ్యక్షులు వరప్రసాద్, సెయింట్ ఆంథోనీ హై స్కూల్ కరస్పాండెంట్ సుందర్ రాజ్ పాల్గొన్నారు.