సత్ జ్ఞాన్ పాఠశాలలో భగవద్గీత అవధానం
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), అక్టోబర్ 1: భావి తరాలకు సాహితీ పరిమళాలు అందించే ఉద్దేశంతో పాటు భావిభారత పౌరులైన విద్యార్ధిని, విద్యార్థులకు భగవద్గీత ప్రాముఖ్యత తెలియజేయడం కోసం భగవద్గీత అవధానం ఏర్పాటు చేశామని నా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గోగులపాటి కృష్ణమోహన్ పేర్కొన్నారు. ఆయన ఆధ్వర్యంలో సత్ జ్ఞాన్ పాఠశాల కరస్పాండెంట్ చింతల మల్లేశం సహకారంతో కుత్బుల్లాపూర్ లోని పాఠశాలలో యువావధాని, ప్రవచన కర్త యర్రంశెట్టి ఉమామహేశ్వరరావుతో భగవద్గీత అవధాన కార్యక్రమాన్ని సోమవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తగా బాధ్యతలు నిర్వహించిన నిర్వాహకులు గోగులపాటి కృష్ణమోహన్ మాట్లాడుతూ భావి తరాలకు సాహిత్యంలోని మాధుర్యం, భగవద్గీత ప్రాముఖ్యత తెలియజేసేందుకు తమ సంస్థ ద్వారా పలు కార్యక్రమాలు చేపడుతున్నామని, అందులో భాగంగానే భగవద్గీత అవధానం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేవలం 22 ఏళ్ల ప్రాయంలోనే యువ అవధానిగా, ప్రవచనకర్తగా రాణిస్తున్న ఉమామహేశ్వరరావు భవిష్యత్తులో శతావధాని గా ఎదగాలని ఆకాంక్షించారు.
పాఠశాల కరస్పాండెంట్ చింతల మల్లేశం కార్యక్రమానికి అధ్యక్షత వహించి అవధానిని ఉద్దేశించి ప్రసంగించారు. చిన్న వయసులోనే అద్భుత ప్రతిభను కనబరిచిన అవధాని భవిష్యత్తులో అత్యంత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు అందరూ అవధానిని మార్గదర్శకంగా తీసుకొని ఆధ్యాత్మిక చింతన పెంపొందించుకోవాలన్నారు. విద్యార్థులనే పృచ్ఛకులుగా (ప్రశ్నలు అడిగే వారిగా) పెట్టి ఈ కార్యక్రమం నిర్వహించడం వల్ల వారిలో భగవద్గీత పట్ల ఎంతగానో ఆసక్తి ఏర్పడిందని తెలిపారు. ఇలాంటి చక్కటి కార్యక్రమం ఏర్పాటుకు తమ పాఠశాలను ఎంపిక చేయడం ఆనందకరమైన అంశమని ఆయన అన్నారు. అవధానంలో పాలు పంచుకున్న అవధానికి, విద్యార్థిని, విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. అనంతరం యువ అవధాని యర్రంశెట్టి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థిని, విద్యార్థులు భగవద్గీతను ప్రతినిత్యం పఠించినట్లైతే తాము చదువుకుంటున్న విద్యలో కూడా మరింత రాణించగలుగుతారని సూచించారు. ప్రతి ఒక్క విద్యార్థి ఏకాగ్రతతో జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించాలని తెలిపారు. అవతారంలో పాల్గొన్న విద్యార్థులు శ్లోక దర్శనం – నికిత, భవ్య శ్రీ, సంఖ్యా దర్శనం – లావణ్య, నవచైతన్య, అంత్యాక్షరి – ప్రభాస్, సాయి గీత, అధ్యాయ వివరణ – యశస్విని, జలహాసిని, అఖండ పఠనం – జాహ్నవి, అఖిల, విలోమ పఠనం – శ్రీ గోదా, నందిని దూబే, అక్షర దర్శనం – హాసిని, గీతిక లు అవధానికి ప్రశ్నలు సంధించారు. కాగా అప్రస్తుత ప్రసంగంలో కవి విట్టుబాబు పాల్గొని ఆవధానిని పలు ఆసక్తికరమైన ప్రశ్నలు వేసి కార్యక్రమాన్ని రంజింపజేశారు. విద్యార్థులు వేసిన ప్రశ్నలకు అవధాని సమయస్పూర్తితో భగవద్గీత శ్లోకాలు ఆలపిస్తూ సమాధానాలు ఇచ్చారు. అనంతరం కార్యక్రమ నిర్వాహకులు, నా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గోగులపాటి కృష్ణమోహన్, యువ అవధాని యర్రంశెట్టి ఉమామహేశ్వరరావును, చింతల మల్లేశంను అభినందన పత్రాలతో, ప్రాశ్నికులను ప్రశంసా పత్రాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు శరత్ ద్యుతి, అమృత, హరిణి, సంజనలు సభా పరిచయం చక్కగా నిర్వహించగా, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్ధిని, విద్యార్థులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.