ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేసిన మొయినాబాద్ ఎంపీడీవో సంధ్య

• 30వ తేదీ వరకు అభ్యంతరాలకు గడువు
• 31వ తేదీన అభ్యంతరాల నివృత్తి
• సెప్టెంబర్ 2న తుది ఓటరు జాబితా విడుదల
మొయినాబాద్ (న్యూస్ విధాత్రి), ఆగస్టు 28: ఓటరు జాబితా పటిష్టతకు ప్రతి ఒక్కరూ సహకరించి తద్వారా రానున్న గ్రామపంచాయతీ ఎన్నికలు సజావుగా సాగేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మొయినాబాద్ మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) బి. సంధ్య పిలుపునిచ్చారు. ఈ మేరకు గ్రామ పంచాయతీ ప్రాతిపదికన వార్డుల వారీగా రూపొందించిన ముసాయిదా (డ్రాఫ్ట్) ఓటరు జాబితాతో పాటు పోలింగ్ కేంద్రాల వివరాలను గురువారం విడుదల చేసి కార్యాలయ నోటీసు బోర్డులో ప్రచురించారు. సదరు జాబితాను మొయినాబాద్ మండల పరిషత్ కార్యాలయంతో పాటు అన్ని గ్రామ పంచాయతీలలో ఏర్పాటు చేసామని వారు తెలిపారు. ముసాయిదా ఓటరు జాబితాను పరిశీలించుకొని ఎటువంటి అభ్యంతరాలు, తప్పొప్పులు ఉంటే ఈనెల 30వ తేదీ లోపు తెలియజేయాలని సూచించారు. ఓటరు జాబితాలో తమ పేరు లేకపోయినా, తప్పులు ఉన్నా, లేదా తొలగించాల్సిన పేర్ల గురించి అయినా ప్రజలు తమ అభ్యంతరాలను అధికారులకు తెలియజేయవచ్చు. వారికి అందిన అభ్యంతరాలను 31వ తేదీన జిల్లా పంచాయతీ అధికారి (డిపిఓ) సమక్షంలో నివృత్తి చేసి తుది జాబితాను వార్డుల వారీగా సెప్టెంబర్ 2వ తేదీన విడుదల చేయనున్నట్లుగా తెలిపారు. ఈ ప్రక్రియ ఎన్నికల్లో పారదర్శకతను మరింత పెంచడంతోపాటు ఎన్నికలు నిష్పక్షపాతంగా, సజావుగా జరిగేందుకు తోడ్పడుతుందని వారు అభిప్రాయపడ్డారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అభ్యంతరాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో వెంకటేశ్వర్ రెడ్డి, మండల సూపరింటెండెంట్ రెహమాన్, కులశేఖర్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More