ఆరోగ్యవంతమైన మహిళే శక్తివంతమైన కుటుంబానికి మూలం
• స్వస్థ నారి – స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన కేఎం గౌరీష్
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), సెప్టెంబర్ 27: మహిళల ఆరోగ్యం, కుటుంబ శ్రేయస్సే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన స్వస్థ నారి – స్వశక్తి పరివార్ అభియాన్ లో భాగంగా ప్రత్యేక ఐతి శిబిరాన్ని కుత్బుల్లాపూర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుత్బుల్లాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్, యూ పీ హెచ్ సి ఇంచార్జి వైద్యాధికారి జి. రిషిత, గైనకాలజీ నిపుణులు డా. సింధుతో కలిసి శుక్రవారం ప్రారంభించారు.

ఈ అభియాన్ ప్రధాన లక్ష్యం మహిళల ఆరోగ్యాన్ని కాపాడుతూ, కుటుంబాన్ని ఆర్థికంగా, సామాజికంగా శక్తివంతం చేయడమేనని వారు అన్నారు. ఆరోగ్యవంతమైన మహిళే శక్తివంతమైన కుటుంబానికి మూలమని, కుటుంబ ఆరోగ్యం, సుఖ సంతోషాలన్నీ మహిళల ఆరోగ్యంపై ఆధారపడి ఉంటాయన్నారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు, బాలికలు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, రక్తహీనత, పోషకాహార లోపం నివారణ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ కార్యక్రమంలో యూపీహెచ్సి వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.