కళాశాల యాజమాన్యం వైఫల్యం… ఆందోళనలో విద్యార్థులు…

• దసరా సెలవులు అనంతరం తెరుచుకొని ప్రైవేట్ కళాశాల
• సాకులతో కాలం వెళ్లదీస్తున్న యాజమాన్యం
• ఆందోళన చెందుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు
• కారణం సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడమా…? భవనానికి అద్దె చెల్లించకపోవడమా…?
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), అక్టోబర్ 17:  ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాల యాజమాన్య వైఫల్యం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ఇటీవల దసరా సెలవుల కోసం కళాశాల గేటుకు వేసిన తాళం సెలవులు ముగిసిన కూడా ఇప్పటివరకు ఇంకా తెరుచుకోకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మేడ్చల్ జిల్లాలోని కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధి చింతల్ లో కే. వెంకన్న పేరుతో ఓ జూనియర్ కళాశాలను నిర్వహిస్తున్నారు. సదరు కళాశాలలో సుమారు 178 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇటీవల దసరా సెలవులకు మూసివేసిన కళాశాల సెలవులు ముగిసిన తెచ్చుకోలేదు. అప్పటినుంచి కళాశాల చుట్టూ తిరుగుతున్న విద్యార్థులకు సాకులు చెప్పుకుంటూ కాలం వెళ్లదీస్తుంది కళాశాల యాజమాన్యం. దీంతో విసిగి వేసారిన విద్యార్థులు శుక్రవారం కళాశాల ముందు ఆందోళన చేపట్టారు. కళాశాల యాజమాన్య వైఫల్యంతో తమ చదువులు మధ్యలో నిలిచిపోయాయని, సిలబస్ లో వెనుకబడిపోయామని, పరీక్షలు సమీపిస్తున్న వేళ ఈ పరిస్థితి తమకు తీవ్ర ఇబ్బందిని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.
• షార్ట్ సర్క్యూట్ అంటూ సాకులు…
ఇదే విషయంపై కళాశాల యాజమాన్యాన్ని విద్యార్థులు ప్రశ్నించగా కళాశాలలో షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల విద్యుత్ సరఫరాలేదని అందువలనే కళాశాల తెరవడానికి ఇంకొంత సమయం పడుతుందని తెలిపినట్లు వెల్లడించారు. షార్ట్ సర్క్యూట్ అయితే దానిని సరి చేయడానికి ఇన్ని రోజులు ఎందుకు పడుతుందని, అది కేవలం సాకు మాత్రమేనని వారు ఆరోపించారు.

తాళం వేసి ఉన్న కళాశాల గేటు

• ఉద్యోగుల జీతాలు ఇవ్వరు… భవన అదే చెల్లించరు…
కళాశాలలో బోధించే అధ్యాపకులకు నెలల తరబడి జీతాలు చెల్లించకపోవడంతో తరచూ వారు మారుతూనే ఉన్నారని విద్యార్థులు తెలిపారు. తరచూ మారుతున్న అధ్యాపకులు ఒకే సబ్జెక్టుని వివిధ పద్ధతులలో బోధిస్తుంటే సబ్జెక్టు అర్థం కాక అయోమయంలో ఉన్నామని తెలిపారు. అంతేకాకుండా అద్దె భవనంలో నిర్వహిస్తున్న కళాశాలకు గత కొన్ని నెలలుగా కళాశాల యాజమాన్యం భవన యజమానికి అద్దె చెల్లించకపోవడం కళాశాల తెలుసుకోకపోవడానికి మరో కారణంగా చర్చించుకుంటున్నారు. భవన యజమాని, కళాశాల యాజమాన్యం మధ్య ఆర్థిక లావాదేవీలపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో కళాశాల కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. దీంతో కొంతమంది తల్లిదండ్రులు కూడా కళాశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఫీజులు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నా, కళాశాల యాజమాన్యం భవన యజమానికి అద్దె ఎందుకు చెల్లించలేదో అర్థం కావడం లేదు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సమయానికి సమస్య పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More