గిన్నిస్ రికార్డే లక్ష్యంగా అయ్యప్ప స్వామి కోటి నామార్చన మహోత్సవం
హైదరాబాద్ (న్యూస్ విధాత్రి), అక్టోబర్ 12: కాలడి శ్రీ ఆదిశంకరాచార్య మఠం, శ్రీ ఉన్నికృష్ణన్ నంబూద్రి ఆధ్వర్యంలో అద్వైత సంఘం నిర్వహణలో 2026 డిసెంబర్ 12 వ తేదీన హైదరాబాద్లోని బైసన్ పోలో మైదానంలో అయ్యప్ప స్వామి కోటి నామార్చన మహోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని భారతదేశంలోనే తొలిసారిగా గిన్నిస్ రికార్డు సాధించే లక్ష్యంతో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
• రామంతాపూర్లో ఆహ్వాన యాత్రకు శ్రీకారం
ఈ మహోత్సవానికి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అయ్యప్ప స్వామి భక్తులను ఆహ్వానించేందుకు చేపట్టనున్న రథయాత్రకు సోమవారం రామంతాపూర్ అయ్యప్ప స్వామి ఆలయంలో శ్రీకారం చుట్టారు. నవంబర్ 21 నుంచి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రథయాత్ర నిర్వహించనున్న నేపథ్యంలో, ముందస్తు కార్యక్రమంగా ఆలయంలో ఆహ్వాన యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాలడి శ్రీ ఆదిశంకరాచార్య మఠం సభ్యులతో పాటు విక్రం రెడ్డి, ఉమాకాంత్, శ్రీకాంత్ లాల్ పాల్గొన్నారు. రామంతాపూర్ అయ్యప్ప స్వామి ఆలయ గురుస్వామి మురళీధర్ ఆధ్వర్యంలో ఫణి కుమార్, ప్రహ్లాద, ఎం. రాజేష్ ప్రజాపతి, రాజి రెడ్డి, రేవు నరసింహ, నగేష్ గుప్తా, అరుణ్ సాయి, రాము తదితర గురుస్వాములు, అయ్యప్ప భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
• కోటి నామార్చనలో భక్తులంతా భాగస్వాములు కావాలి
డిసెంబర్ 12న నిర్వహించనున్న అయ్యప్ప స్వామి కోటి నామార్చన మహోత్సవాన్ని విజయవంతం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని రామంతాపూర్ అయ్యప్ప స్వామి ఆలయ నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గురుస్వామి, అయ్యప్ప స్వామి మాలధారణ చేసే భక్తుడు ఈ మహోత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని వారు పిలుపునిచ్చారు.