దుండిగల్ మున్సిపాలిటీలో చలాకీ చైన్ మెన్లు…

• అందిన కాడికి దండుకుంటూ అక్రమ నిర్మాణదారులకు అండదండలు
• అంతా తామై చలామణి అవుతున్న వైనం
• కళ్ళముందే కనిపిస్తున్న చర్యలు తీసుకొని యంత్రాంగం
• కాసుల కక్కుర్తి తో అక్రమ నిర్మాణాలకు అడ్డగా దుండిగల్ మున్సిపాలిటీ
దుండిగల్ (న్యూస్ విధాత్రి), ఆగస్టు 19: కంచే చేను మేసిందనే చందంగా తయారైంది పట్టణ ప్రణాళిక విభాగం దుస్థితి. పట్టణ ప్రణాళిక విభాగంలో విధులు నిర్వహిస్తున్న చైన్ మాన్లు చలాకీలుగా మారి మున్సిపల్ పరిధిలో పలు ప్రాంతాలలో అక్రమ భవన నిర్మాణాలు, అదనపు అక్రమ అంతస్తులు, అక్రమ షెడ్డుల నిర్మాణాలకు తోడ్పాటు అందిస్తూ, అందిన కాడికి దండుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ వారి జేబులు నింపుకుంటున్నారు. వారంతా వాస్తవానికి ఔట్ సోర్సింగ్ సిబ్బంది అయినప్పటికీ అన్నీ తామై పెత్తనం చలాయిస్తూ పబ్బం గడుపుతున్నారు.

టెక్ మహీంద్రా ఎదురుగా నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలు

• నోటీసులతో సరి… చర్యలు శూన్యం…
మున్సిపల్ పరిధిలో పలు ప్రాంతాల్లో ప్రమాదకరంగా నిర్మించే అక్రమ భవన నిర్మాణాలు, షెడ్డులపై ఎవరైనా ఫిర్యాదు చేసినప్పుడో, ఏదైనా పత్రికల్లో ప్రచురితమైనప్పుడో తూతూ మంత్రంగా నోటీసులను జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారు. నోటీసులు జారీ చేసిన అనంతరం ఎటువంటి చర్యలు తీసుకోకుండా అక్రమ నిర్మాణాలు పూర్తయ్యే వరకు నిర్మాణదారులకు సహాయ సహకారాలు అందించేందుకు భేరాసారాలు కుదుర్చుకొని అక్రమ నిర్మాణాలకు చైన్ మెన్లు భరోసా ఇస్తున్నారంటే ఏ స్థాయికి వారి అజమాయిషి దుండిగల్ మున్సిపల్ లో నడుస్తుందో ఇట్టే అవగతం చేసుకోవచ్చు.

బౌరంపేటలో అనుమతులు లేకుండా నిర్మించిన మరో షెడ్డు

• టౌన్ ప్లానింగ్ విభాగంలో మేమే సుప్రీం…
మున్సిపల్ పరిధిలో అక్రమ భవన నిర్మాణాలు, షెడ్డుల నిర్మాణాలకు సంబంధించిన ఏ సమస్య అయినా తామే పరిష్కరిస్తామని, టౌన్ ప్లానింగ్ విభాగంలో తామే సుప్రీమ్ అని చెప్పుకుంటూ అక్రమ నిర్మాణదారుల నుంచి కాసులు దండుకుంటున్నారు. దుండిగల్ మున్సిపల్ పరిధిలోని బౌరంపేట, గండి మైసమ్మ, బహుదూర్ పల్లి, దొమ్మర పోచంపల్లి, దుండిగల్, మల్లంపేట, గగిల్లాపూర్ తో పాటు పలు ప్రాంతాల్లో అక్రమ భవన నిర్మాణాలు, షెడ్డులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. కళ్ళ ముందే ఇంత జరుగుతున్న కాసుల కక్కుర్తి తో కనీసం వాటి వైపు కూడా చూసే ప్రయత్నం కూడా చేయలేని నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు టౌన్ ప్లానింగ్ యంత్రాంగం.

నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్ నిర్మిస్తున్న భవనం

• చైన్ మెన్ ల ఆగడాలకు అడ్డుకట్టపడేనా…?
మున్సిపల్ లో చైన్ మెన్లుగా విధులు నిర్వహించే సిబ్బంది మున్సిపల్ పరిధిలో వారికి కేటాయించిన ప్రాంతాలలో ప్రతిరోజూ క్షేత్రస్థాయిలో తిరుగుతూ అక్రమ భవన నిర్మాణాలు, అక్రమ అదనపు అంతస్తులు, అక్రమ షెడ్డులను గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఉన్నతాధికారుల ఆదేశాల అనుసారం వారు నడుచుకోవాల్సి బాధ్యత వారిపై ఉంటుంది.

సింహపురి కాలనీలో అనుమతులు లేకుండా నిర్మించిన భారీ షెడ్డు

కానీ.. దుండిగల్ మున్సిపాలిటీలో దానికి విరుద్ధంగా చైన్ మెన్లు అంతా తామై ఉన్నతాధికారులుగా చలామణి అవుతున్నారనే వాదనలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. మరి ఇంత జరుగుతున్న ఉన్నతాధికారులకు ఈ విషయం తెలిసే ఉంటుందని, వారి అండదండలతోనే చైన్ మెన్లు రెచ్చిపోతున్నారని మరో వాదన కూడా బలంగానే వినిపిస్తుంది. మరి ఇప్పటికైనా చైన్ మెన్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసి అక్రమ నిర్మాణాలపై ఉన్నతాధికారులు ఏ మేరకు చర్యలు తీసుకుంటారో… వేచి చూడాల్సిందే.

టెక్ మహీంద్రా ఎదురుగా నిర్మిస్తున్న మరో అక్రమ కమర్షియల్ భవనం

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More