నయారాలో నాణ్యతలేని పెట్రోలు… వినియోగదారుల ఆగ్రహం
• నీరు కలిసిన పెట్రోలు విక్రయిస్తున్న వైనం
• సిబ్బంది నిలదీసిన వినియోగదారులు… దురుసుగా ప్రవర్తించిన సిబ్బంది
• పెట్రోల్ బంక్ యాజమాన్యం నష్టాన్ని భరించాలని డిమాండ్
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), ఆగస్టు 21: కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధి సుభాష్ నగర్ పైప్ లైన్ రోడ్డులోని నయారా పెట్రోల్ బంక్లో నీరు కలిసిన పెట్రోలును విక్రయిస్తూ వినియోగదారులను మోసం చేస్తున్నారు. వాహనాల్లో నీరు కలిసిన పెట్రోలు కొట్టడంతో వాహనాలు పాడై ఆగిపోతున్నాయని వినియోగదారులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

• ఘటన బయటపడింది ఇలా…
గురువారం మధ్యాహ్నం ఓ ద్విచక్ర వాహనదారుడు సదర్ పెట్రోల్ పంపులో పెట్రోల్ కొట్టించుకున్నారు. పెట్రోలు కొట్టించుకున్న అనంతరం ద్విచక్ర వాహనం చాలాసేపు స్టార్ట్ కాకపోగా దారి మధ్యలో ఆగిపోయింది. దాంతో అనుమానం వచ్చిన ఆ వ్యక్తి తన వాహనాన్ని మెకానిక్ దగ్గరకు తీసుకు వెళ్ళాడు. వాహనాన్ని పరిశీలించిన మెకానిక్ పెట్రోలులో నీరు కలవడంతోనే సమస్య ఏర్పడిందని తెలిపాడు. దీంతో పెట్రోలు ట్యాంక్ నుంచి పెట్రోలును బయటికి తీసి చూసి నీరు కలిసినట్టుగా గుర్తించారు.

అనంతరం అనుమానంతో తిరిగి బంక్ వద్దకు చేరుకొని అక్కడ ఉన్న సిబ్బందిని నిలదీశారు. సిబ్బంది వినియోగదారుల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ తమ బంకులో పెట్రోల్ పోయించుకుని బంక నుంచి బయటకు వెళ్లిన తర్వాత తమకు ఎటువంటి సంబంధం ఉండదని, అక్కడి నుంచి వెళ్లిపోవాలని దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఆగ్రహించిన వినియోగదారులు గుమ్మికూడి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తమ వాహనాలకు నష్టం కలిగిందని, నాణ్యమైన పెట్రోలు కోసం డబ్బు వసూలు చేసి నీరు కలిసిన నాసిరకం పెట్రోలును వస్తున్నారని మండిపడ్డారు. తమకు కలిగిన నష్టాన్ని బంక్ యాజమాన్యం భరించాలని బాధితులు డిమాండ్ చేశారు.
దీంతో బంక్ ముందు కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

• తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకుంటాం. – కళ్యాణ్, ఏ ఎస్ వో, బాలానగర్ జోన్
పెట్రోల్ బంకులో తనిఖీలు నిర్వహించి నాణ్యత ప్రమాణాలను పరిశీలిస్తాం. అలాగే సేల్స్ అధికారికి సమాచారం అందిస్తాం. పెట్రోల్ లో నీరు కలిసినట్లుగా నిర్ధారణ అయితే సదరు పెట్రోల్ బంక్ పై తగిన చర్యలు తీసుకుంటాం. అలాగే వాహనదారులకు జరిగిన నష్టాన్ని పెట్రోలు బంకు యాజమాన్యం భరించేలా చర్యలు తీసుకుంటాం.