• పోలీసులకే సవాలు విసిరిన దొంగలు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూలై 9: ఆ ప్రాంతంలో నాకాబందీ పెట్టి కార్డెన్ సెర్చ్ చేసిన కొద్ది గంటల వ్యవధిలోనే జీడిమెట్ల పోలీసులకు సవాలు విసురుతూ అదే ప్రాంతంలో ఓ ఏటీఎంను దొంగలు కొలగొట్టి నగదును ఎత్తుకెళ్లారు. కార్డెన్ సెర్చ్ ముగిసింది… ఇక ఇటువైపు పోలీసులు రారులే అనుకున్నారో ఏమో కానీ…! ఏకంగా గ్యాస్ కట్టర్ తో ఏటీఎం యంత్రాన్ని కట్ చేసి మరి నగదును దోచుకెళ్లారు.

వివరాల ప్రకారం… జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి లోని మార్కండేయ నగర్ లో బాలానగర్ ఎసిపి నరేష్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం నాకాబందీ పెట్టి రాత్రి సుమారు 8 గంటల వరకు పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. అనంతరం అదే ప్రాంతంలో ఉన్న హెచ్ డి ఎఫ్ సి బ్యాంకుకు చెందిన ఏటీఎంను తెల్లవారుజామున సుమారు 3.30 గంటలకు గ్యాస్ కట్టర్ల సహయంతో ఏటిఎం మిషన్ లో డబ్బులు పెట్టే బాక్సును దుండగులు ఎత్తుకెళ్లారు.

సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.