నేరాల నియంత్రనే కార్డెన్ సర్చ్ ఉద్దేశ్యం. – మేడ్చల్ డిసిపి కోటిరెడ్డి
• పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధి మల్లన్న కాలనీలో నిర్వహించిన కార్డెన్ సర్చ్
• సెర్చ్ లో పాల్గొన్న 285 మంది పోలీసులు
• మొత్తం 620 ఇళ్ల తో పాటు 1,884 మంది వ్యక్తులను తనిఖీ
• అక్రమ మద్యం, గంజాయి వినియోగదారులు, అక్రమ గ్యాస్ రీఫిలింగ్ కేంద్రాలను గుర్తించిన పోలీసులు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూలై 31: నేరాలను అరికట్టేందుకు నేరస్తులను, అనుమానితులను పట్టుకోవడమే ముఖ్య ఉద్దేశంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని షామీర్పేట మండలంలోని మల్లన్న కాలనీ, దేవరాయంజల్ ప్రాంతాల్లో మేడ్చల్ డిసిపి కోటిరెడ్డి పర్యవేక్షణలో కార్డన్ సెర్చ్ ను పకడ్బందీగా గురువారం నిర్వహించారు. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు నిర్వహించిన కార్డెన్ సెర్చ్ లో ఆర్మ్డ్ ఫోర్స్, ఎస్ ఓ టి, సిసిఎస్ తో పాటు ట్రాఫిక్ విభాగాలతో సహా మొత్తం 285 మంది పోలీసు అధికారులు పాల్గొన్నారు.

వీరంతా కలిసి ఒక హోల్డింగ్ బృందం, 11 కార్డన్ బృందాలు, 3 వాహనాల తనిఖీ బృందాలు, 3 పికప్ బృందాలు, 11 సెర్చ్ బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు. సదరు బృందాలు మొత్తం 620 ఇళ్లతో పాటు 1,884 వ్యక్తులను తనిఖీ చేసి వారి గురించి పూర్తి వివరాలను తెలుసుకున్నారు. తనిఖీ చేసిన మొత్తం 1,884 వ్యక్తులలో బీహార్ కు చెందిన వారు 330 మంది, ఉత్తరప్రదేశ్ కు చెందిన వారు 282 మంది, మహారాష్ట్ర కు చెందిన 260 మంది, కర్ణాటకకు చెందిన 180 మంది,జార్ఖండ్ కు చెందిన 150 మంది, ఒరిస్సాకు చెందిన 175 మందితో పాటు ఇతరాత్ర రాష్ట్రాలకు చెందిన 107 మంది, 400 మంది స్థానికులు ఉన్నారు.

వీరి నుంచి సరైన పత్రాలు లేని 35 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఇద్దరు గంజాయి వినియోగదారులను గుర్తించి అరెస్టు చేశారు. 74.200 లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకొని రెండు అక్రమ మద్యం కేసులు నమోదు చేశారు. పెండింగ్ లో ఉన్న 244 చలాన్లను నుంచి రూ.1,02,320 వసూలు చేశారు. రెండు హుక్కా పాట్స్, 300 గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా గ్యాస్ నింపే 2 కేంద్రాలను గుర్తించి 63 సిలిండర్లు, ఒక తూకం యంత్రం, రీఫిల్లర్ ను స్వాధీనం చేసుకున్నారు. కార్డెన్ సర్చ్ లో పాల్గొన్న 285 మంది పోలీసుల్లో డిసిపి, ఏడిసిపి, ముగ్గురు ఏసీపీలు, 11 మంది ఇన్స్పెక్టర్లు, 46 మంది ఎస్ఐలు, ఏఎస్ఐలు, 223 మంది కానిస్టేబుళ్ళు, సిబ్బంది పాల్గొన్నారు.