• సూపరింటెండెంట్ నుంచి సహాయ మున్సిపల్ కమిషనర్ (ఏఎంసీ) గా పదోన్నతి
• ఓ పక్క వీడ్కోలు సమావేశం… మరో పక్క పదోన్నతి ఉత్తర్వులు
• అవధులు లేని ఆనందంలో అల్వాల్ సర్కిల్ రెవెన్యూ అధికారి స్వామి, కుటుంబ సభ్యులు
అల్వాల్ (న్యూస్ విధాత్రి), ఆగస్టు 1 : గత 40 సంవత్సరాలుగా ఆయన ఉద్యోగ రీత్యా చేసిన సేవల ప్రతి ఫలమో… అతని మంచితనమో.. లేక అదృష్టమో… ఏమో కానీ పదవీ విరమణ రోజే పదోన్నతి వరించడంతో తనతో పాటు కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఓ పక్క పదవీ విరమణ వీడ్కోలు సమావేశం నిర్వహిస్తుండగానే మరో పక్క పదోన్నతి ఉత్తర్వులు జారీ కావడం అరుదైన విశేషం. అల్వాల్ సర్కిల్ రెవెన్యూ విభాగంలో సూపరింటెండెంట్ గా విధులు నిర్వహించి గురువారం పదవీ విరమణ పొందిన బెండల స్వామిని ఉన్నతాధికారులు, సహచరులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. అల్వాల్ లోని పంజాబ్ కమ్యూనిటీ హాల్ లో నిర్వహించిన కార్యక్రమంలో అల్వాల్ ఉప కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డిలు పాల్గొని స్వామిని గజమాలతో సత్కరించగా ఏఎంసి నారాయణరావు, ఎసిపి శ్రీనివాస్ రెడ్డి, డిఈలు రఘు, ప్రశాంతి, ప్రాజెక్టు అధికారి మధుమోహన్, ఎంటమాలజీ ఏఈ అనిల్ కుమార్, ఎస్ఎస్ ప్రభాకర్, ఉద్యానవన శాఖ అధికారి ప్రవీణ, జేఏసీ నాయకుడు సురేందర్ రెడ్డితో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు.
వారంతా సూపరిండెంట్ స్వామితో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. స్వామి గత 40 సంవత్సరాల ఉద్యోగ ప్రయాణంలో మున్సిపాలిటీ తో పాటు జిహెచ్ఎంసి లో వివిధ హోదాల్లో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించి అందరి మన్ననలతో పాటు అభిమానాన్ని పొందాలని కొనియాడారు.అనంతరం స్వామి మాట్లాడుతూ మనం చేసే పని మీద పట్టుదల, కృషి ఉన్నప్పుడే ముందుకు సాగుతామన్నారు. అందరి సహాయ, సహకారాలు, సూచనలు, అభిమానంతోనే 40 సంవత్సరాలుగా సర్విస్ చేయగలిగానన్నాడు. పని విషయంలో ఉన్నతాధికారులతో గిల్లిగజ్జాలు, పట్టువిడుపులు సహజమే అన్నారు. వాటన్నింటినీ మనస్సులో పెట్టుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోవాలని తెలిపారు. తన సర్వీస్ కాలంలో ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించాలని కోరారు. ప్రధానంగా కుటుంబ సభ్యుల చేయూత ఎంతో అవసరమని తెలిపారు. అనంతరం పలువురు అధికారులు, సహచరులు, సిబ్బంది ఆయనకు శాలువాలు కప్పి, పుష్పగుచ్చాలు, జ్ఞాపికలు అందజేసి ఘనంగా సన్మానించారు.