బండ్లబాట @ 40 అడుగులు..!
• రియల్ సంస్థ అనుమతుల కోసమే 40 అడుగుల విస్తరణ
• అక్రమ రోడ్డు విస్తరణ కోసం పచ్చని చెట్లు బలి
• రోడ్డు విస్తరణలో 16 గుంటల ప్రభుత్వ స్థలం ఉందని కలెక్టర్ కు నివేదిక
దుండిగల్ (న్యూస్ విధాత్రి), జూలై 31: దుండిగల్ మండలం బౌరంపేట సర్వేనెంబర్ 166/1, 166/3 ప్రభుత్వ స్థలంలో ఓ బడా సంస్థకు చెందిన ప్రైవేటు వెంచర్ కు అధికారుల అండదండలతో అక్రమంగా రహదారిని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. గతంలో బండ్ల బాటగా ఉన్న దారిని ప్రస్తుతం 40 అడుగులకు విస్తరించి రహదారి నిర్మాణాన్ని చేపడుతూ సదరు సంస్థకు లబ్ధి చేకూరేలా అటు అధికారులు, ఇటు అధికార పార్టీ స్థానిక నాయకులు పావులు కదుపుతున్నారు.

ప్రభుత్వ భూమిని ఆనుకొని ఉన్న సుమారు 80 ఎకరాలలో సదరు బడా రియల్ సంస్థలు రియల్ దందా చేసేందుకు ఆయా శాఖల నుంచి అవసరమైన అనుమతులు పొందేందుకు ప్రభుత్వ స్థలంలో బండ్లబాటగా ఉన్న దారిని కాస్త 40 అడుగులకు విస్తరించి సీసీ రోడ్డు నిర్మాణ పనులను చక చక చక్కపెడుతున్నారు. ఇంత బహిరంగంగా ప్రభుత్వ స్థలంలో దర్జాగా రోడ్డు నిర్మాణాన్ని చేస్తున్న అధికారులకు చీమకుట్టినట్లుగా కూడా లేకపోవడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాము చిన్న పశువుల కొట్టాన్ని నిర్మించుకుంటేనే ఆగమేఘాలపై వచ్చి కూల్చివేతలు చేపట్టిన రెవెన్యూ అధికారులకు ఇంత పెద్ద ఎత్తున జరిగే తతంగం కనిపించడం లేదా అని మండిపడుతున్నారు.

~ అక్రమ రోడ్డు నిర్మాణం కోసం పచ్చడి చెట్లపై గొడ్డలి వేటు…
ప్రభుత్వ స్థలంలో అక్రమ రోడ్డు విస్తరణకు బండ్లబాటగా ఉన్న దారిని 40 అడుగుల వెడల్పు చేసేందుకు రోడ్డు పక్కన ఉన్న అనేక పచ్చని చెట్లను ఇష్టానుసారం నరికేశారు. చెట్లను తొలగించేందుకు తీసుకోవాల్సిన ఎటువంటి అనుమతులను కూడా సంబంధిత శాఖల నుంచి పొందలేదనే సమాచారం ఉంది. సర్వేనెంబర్ 166/1, 166/3 ప్రభుత్వ స్థలంలో ప్రైవేటు వెంచర్ కోసం 16 గుంటల స్థలాన్ని ఆక్రమించుకొని రోడ్డు పనులు చేపడుతున్నారని స్థానిక రెవెన్యూ అధికారులు కలెక్టర్ కు నివేదిక అందజేసినట్లు తెలుస్తుంది. నివేదిక ఆధారంగా మరి అధికారులు ఏ మేరకు స్పందించి సదరు విషయంపై చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.