బాచుపల్లిలో డ్రగ్స్ విక్రయాలపై ఈగల్ ఫోర్స్ దాడులు.. ఇద్దరు అరెస్ట్
నిజంపేట (న్యూస్ విధాత్రి), అక్టోబర్ 17: బాచుపల్లి: డ్రగ్స్ విక్రయాలపై ఈగల్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మమతా ఆసుపత్రి ఎదురుగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 6.2 గ్రాముల ఎండీఎంఏ, 5.83 గ్రాముల ఎండు గంజాయి, రెండు ఐఫోన్లు, డ్రగ్స్ తూకం వేసే యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టయిన వారిని ఛత్తీస్గఢ్కు చెందిన దినేశ్ కుమార్ (27), నీలాభ్ శర్మ (24)గా గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం.. దినేశ్ కుమార్ 2024 నుంచి వ్యక్తిగత ఖర్చుల కోసం గంజాయి వ్యాపారం చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. జేఎన్ సుహాస్తో కలిసి గంజాయి, ఎండీఎంఏ విక్రయిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఎండీఎంఏను గ్రాముకు రూ.5 వేల చొప్పున, గంజాయి ప్యాకెట్ను రూ.600కు కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయించినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో డ్రగ్స్ కొనుగోలు చేసిన ఏడుగురి వివరాలను పోలీసులు సేకరించారు. డ్రగ్స్ సరఫరా నెట్వర్క్పై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న మణికంఠ, జేఎన్ సుహాస్ కోసం గాలింపు చేపట్టారు.