బాపునగర్ లో మౌలిక వసతుల కోసం అధికారులకు వినతిపత్రాలు

• సమర్పించిన సంక్షేమ సంఘం సభ్యులు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 1:  బాపునగర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాలనీలో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలు, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, విద్యుత్ భద్రత, శాంతిభద్రతల అంశాలపై సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులకు పలు వినతిపత్రాలు సోమవారం సమర్పించారు. సంక్షేమ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు పి. జగదీష్ గౌడ్, సిహెచ్. దయానంద్ నాయకత్వంలో ప్రతినిధుల బృందం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీడిమెట్ల సర్కిల్ ఉప కమిషనర్ డి. శంకర్ సింగ్‌ను కలిసి అభివృద్ధి పనుల కోసం వినతిపత్రం అందజేశారు. కాలనీలో రహదారులు దెబ్బతిని గుంతల మయంగా మారిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో నీరు నిల్వ ఉండటం వల్ల పాదచారులు, విద్యార్థులు, వృద్ధులు, వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారని వివరించారు. రోడ్డు నెంబర్ 1,4,5లతో పాటు రెండు అంతర్గత రోడ్లతో కలిపి సుమారు 605 మీటర్ల పొడవున సీసీ రోడ్లు నిర్మించాలని కోరారు. అదేవిధంగా కాలనీలో ఉన్న చెత్త డంపింగ్ యార్డును తొలగించి, చెత్తను ప్రతిరోజూ సకాలంలో తరలించాలని కోరారు. డెంగ్యూ, మలేరియా నివారణ కోసం వారానికి రెండు సార్లు ఫాగింగ్ నిర్వహించడం, రోజువారీ రోడ్ల శుభ్రత కార్యక్రమాలు చేపట్టడం, పనిచేయని వీధి దీపాలను మరమ్మతు చేయడం, అవసరమైన చోట నూతన వీధి దీపాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

జలమండలిలో వినతిపత్రం అందజేస్తున్న సంక్షేమ సంఘం సభ్యులు

• జలమండలి కార్యాలయంలో…
బాపునగర్‌లో తాగునీటి తక్కువ ఒత్తిడి ( లో ప్రెషర్), నీటి ట్యాంకర్ల అవసరం, రోడ్డు నెంబరు 3లోని ఆర్‌ఎస్‌కే పాఠశాల సమీపంలో బోర్‌వెల్ మరమ్మతు, వర్షపు నీటి సంరక్షణ గుంతల నిర్మాణం, మాన్‌హోల్స్‌లో పేరుకుపోయిన మట్టిని తొలగించడం వంటి సమస్యల పరిష్కారం కోసం జలమండలి అధికారులకు ప్రత్యేక వినతిపత్రం సమర్పించారు.
• పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ లో…
కాలనీలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు కూడా సంక్షేమ సంఘ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. రాత్రి వేళల్లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గంజాయి సేవించడం, ఇతర సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని తెలిపారు. దీంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారని, సాయంత్రం, రాత్రి సమయాల్లో క్రమం తప్పకుండా పోలీస్ పహారా నిర్వహించాలని, అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

డిసి శంకర్ సింగ్ కు సమస్యలు వివరిస్తున్న సభ్యులు

• విద్యుత్ శాఖ కార్యాలయంలో…
బాపునగర్ రోడ్డు నెంబర్లు 2, 3, 4 ప్రాంతాల్లో ఉన్న 11 కెవి ఓవర్‌హెడ్ విద్యుత్ లైన్లను ఇన్సులేటెడ్ ఏరియల్ బంచ్డ్ (ఏబి) కేబుళ్లతో మార్చాలని విద్యుత్ శాఖ అధికారులను విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఉన్న విద్యుత్ తీగలు వర్షాకాలంలో ప్రమాదకరంగా మారుతున్నాయని, స్పార్కింగ్, విద్యుత్ అంతరాయాలు చోటుచేసుకుంటున్నాయని, ఇటీవల జరిగిన ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రజల ప్రాణ భద్రత దృష్ట్యా సుమారు 420 మీటర్ల పొడవున ఉన్న విద్యుత్ లైన్లను ఏబీ కేబుళ్లతో మార్చాలని డిమాండ్ చేశారు. ఈ వినతిపత్రాలను సానుకూలంగా పరిగణించి తక్షణ చర్యలు చేపట్టాలని సంక్షేమ సంఘ ప్రతినిధులు అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ ఉపాధ్యక్షులు యు. మల్యాద్రి, కె.వి. రాజేష్, బి. బాబురావు, ఖజాంచి జి. మధుసూదన్, సంయుక్త కార్యదర్శులు ఎం. రాజారెడ్డి, కె. రాజు యాదవ్, టి. దత్తాత్రేయ, ఆర్గనైజింగ్ కార్యదర్శులు ఎ. లక్ష్మీనారాయణ గౌడ్, ఎ. శ్రీధర్ కుమార్, సభ్యులు కె.వి. రాజేంద్ర ప్రసాద్, ఆర్. శ్రీరామ్, ఈ. సంపత్ గౌడ్, సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More