మహిళా సెక్యూరిటీ గార్డ్‌కు రావాల్సిన వేతనం ఇప్పించిన కార్మిక నాయకుడు రవి

కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), ఫిబ్రవరి 23: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాంధీనగర్ పారిశ్రామికవాడలో పనిచేస్తున్న ఓ మహిళా సెక్యూరిటీ గార్డ్‌కు రావాల్సిన వేతనం నిలిపివేయడంపై స్పందించిన బిఆర్‌టియు రాష్ట్ర కార్మిక నాయకుడు, శ్రమశక్తి అవార్డు గ్రహీత రవి వెంటనే జోక్యం చేసుకుని న్యాయం చేయించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఎస్ఆర్ఎఫ్ సెక్యూరిటీ ఏజెన్సీలో సెక్యూరిటీ గార్డ్‌గా విధులు నిర్వర్తిస్తున్న మహిళా కార్మికురాలు సరిత, కొన్ని అనివార్య కారణాల వల్ల డ్యూటీ మానేయాల్సి వచ్చింది. అయితే 2025 సంవత్సరం సెప్టెంబర్ నెలకు సంబంధించిన పూర్తి వేతనం రూ.19,500/- ఆమెకు చెల్లించాల్సి ఉండగా, సంస్థ ప్రతినిధులు ఆ మొత్తాన్ని ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. వేతనం కోసం పలుమార్లు అడిగినా స్పందన రాకపోవడంతో, ఏం చేయాలో అర్థంకాక సరిత తోటి సెక్యూరిటీ సిబ్బందిని సంప్రదించింది. వారి సూచనతో ఆమె బిఆర్‌టియు రాష్ట్ర కార్మిక నాయకుడు రవి కార్యాలయానికి వెళ్లి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. విషయం తెలిసిన వెంటనే స్పందించిన రవి, హుటాహుటిన ఎస్ఆర్ఎఫ్ సెక్యూరిటీ ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లి నిర్వాహకులతో మాట్లాడారు. మహిళా కార్మికురాలికి రావాల్సిన రూ.19,500/- వేతనాన్ని తక్షణమే చెల్లించేలా ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో సరితకు రావాల్సిన పూర్తి వేతనాన్ని ఏజెన్సీ అందజేసింది. ఈ సందర్భంగా మహిళా సెక్యూరిటీ గార్డ్ సరిత మాట్లాడుతూ…మా వంటి సాధారణ కార్మికుల సమస్యలను పట్టించుకుని వెంటనే స్పందించి న్యాయం చేసిన కార్మిక నాయకుడు రవికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ఈ కార్యక్రమంలో అనిల్, సుదర్శన్, జగన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More