రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహణ

√ టిఎల్ఎఫ్ సభ్యులు, ఆర్పి లకు అవగాహన కల్పించిన మేడ్చల్ ట్రాఫిక్ ఏసిపి వెంకట్ రెడ్డి
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జనవరి 27:  రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు అతివేగం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగంలో నిర్లక్ష్యం వంటివేనని మేడ్చల్ ట్రాఫిక్ ఏసిపి వెంకటరెడ్డి అన్నారు. ఈ కారణాలను నియంత్రించగలిగితే అనేక ప్రాణాలను కాపాడుకోవచ్చని సూచించారు. జీడిమెట్ల సర్కిల్ పరిధిలోని పట్టణ స్థాయి సమాఖ్య సభ్యులు (టిఎల్ఎఫ్), రిసోర్స్ పర్సన్లు( ఆర్ పి లు) లకు రోడ్డు భద్రతపై ఆయన, జీడిమెట్ల ట్రాఫిక్ సిఐ వి. నరసింహారావుతో కలిసి విస్తృత అవగాహన కార్యక్రమాన్ని జీడిమెట్ల సర్కిల్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు.

టిఎల్ఎఫ్ సభ్యులతో ట్రాఫిక్ ఏసిపి వెంకట్ రెడ్డి

పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో ప్రజల్లో, ముఖ్యంగా వాహనదారులు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ట్రాఫిక్ పోలీసు అధికారులు తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిన అవసరం ఉందని, నాలుగు చక్రాల వాహనాల్లో సీట్‌బెల్ట్ వినియోగం ప్రాణ రక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. ట్రాఫిక్ సిగ్నల్స్‌ను పాటించడం, లైన్ డిసిప్లిన్‌ను అనుసరించడం, మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ వాహనాలు నడపకూడదని సూచించారు. పాదచారుల భద్రతపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి, జీబ్రా క్రాసింగ్ వద్ద వాహనాలను ఆపడం, పాఠశాల, హాస్పిటల్ జోన్లలో వేగాన్ని తగ్గించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. ముఖ్యంగా పిల్లలు, మహిళలు, వృద్ధుల పట్ల డ్రైవర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అలాగే రోడ్డు పై వాహనాలు పార్కింగ్ చేయడం వల్ల ట్రాఫిక్ అడ్డంకులు ఏర్పడి ప్రమాదాలకు దారి తీస్తున్నాయని, నిర్దేశిత పార్కింగ్ ప్రాంతాల్లోనే వాహనాలు నిలిపివేయాలని ఎసిపి తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడమే కాకుండా, ఇతరులు కూడా పాటించేలా అవగాహన కల్పించడంలో టిఎల్ఎఫ్ సభ్యులు, మహిళలు కీలక పాత్ర పోషించాలని కోరారు. ఈ అవగాహన కార్యక్రమంలో టిఎల్ఎఫ్ సభ్యులు పద్మ, ఆసియా, శ్యామల, ట్రాఫిక్ పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More