కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జనవరి 30: ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం సమ్మక్క–సారాలమ్మ తల్లి జాతర విశిష్టతను గడిచిందని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. అమ్మవార్ల దయతో రాష్ట్ర ప్రజలందరికీ సుఖశాంతులు, ఆరోగ్యం, ఆనందం కలగాలని, అలాగే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా, సమృద్ధిగా, శాంతియుతంగా వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. పచ్చని అరణ్యాల మధ్య వెలసిన అపార ఆధ్యాత్మిక శక్తి కేంద్రమైన మేడారం, గిరిజన గుండెల్లో వెలిగే భక్తి దీపం సమ్మక్క–సారలమ్మలను కూన శ్రీశైలం గౌడ్ శుక్రవారం భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. సమ్మక్క– సారలమ్మలతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, గిరిజన సంప్రదాయాలకు అనుగుణంగా పూజారులు నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

అనంతరం మేడారంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్, శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి సహా ఇతర కాంగ్రెస్ పార్టీ ప్రముఖులను మర్యాదపూర్వకంగా కలిశారు.