అక్రమ ఆక్రమణలపై కఠిన చర్యలు తప్పవు. -డిసి శ్రీపాద రామేశ్వర్
– బాచుపల్లి ప్రధాన రహదారిపై ఫుట్ పాత్ ఆక్రమణలను తొలగించిన అధికారులు
గాజులరామారం (న్యూస్ విధాత్రి), ఏప్రిల్ 21: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గాజులరామారం సర్కిల్ పరిధిలోని బాచుపల్లి ప్రధాన రహదారిపై ఫుట్‌పాత్‌లను ఆక్రమించిన నిర్మాణాలపై సర్కిల్ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. సిఎంసి కమిషనర్ ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి ఫుట్‌పాత్‌లపై ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. సంబంధిత ఆక్రమణదారులకు పలుమార్లు నోటీసులు జారీ చేసి స్వచ్ఛందంగా నిర్మాణాలను తొలగించుకోవాలని సూచించినప్పటికీ, వారు స్పందించకపోవడంతో బలవంతపు కూల్చివేత చర్యలు చేపట్టాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. ఈ చర్యలతో రహదారిపై నడిచే పాదచారులకు ఇబ్బందులు తొలగి, ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు మార్గం వీలు కలిగిందన్నారు.

సర్కిల్ పరిధిలోని రహదారులు, ఫుట్‌పాత్‌లపై ఎలాంటి అక్రమ ఆక్రమణలు చేసినా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఉప కమిషనర్ శ్రీపాద రామేశ్వర్ హెచ్చరించారు. ప్రజలు నగర సౌందర్యాన్ని కాపాడేందుకు, ట్రాఫిక్ సమస్యలను నివారించేందుకు మున్సిపల్ నిబంధనలు పాటించాలని సూచించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి అక్రమ నిర్మాణాలపై నిరంతరంగా చర్యలు కొనసాగిస్తామని అధికారులుతెలిపారు. ఈ కూల్చివేత కార్యక్రమంలో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, టీపీఎస్ మచేందర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.