~ నమ్మించి మోసం చేసి మత్తు ఇచ్చి రూ. 50లక్షల సొత్తుతో పరారీ
~ సాంకేతిక ఆధారాలతో 24 గంటల్లో కేసు ఛేదించిన బాలానగర్ పోలీసులు
బాలానగర్ (న్యూస్ విధాత్రి), మార్చి 16: అయ్యో పాపమని ఆశ్రయం ఇచ్చిన ఇంటికే కన్నం వేసిన ఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. నమ్మిన వారిని మత్తులో ముంచి, లక్షల రూపాయల విలువైన బంగారం, వెండి ఆభరణాలను దోచుకుని పరారైన నిందితులను బాలానగర్ పోలీసులు 24 గంటల్లోనే అరెస్ట్ చేసి కేసును ఛేదించారు.

బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… ఆదర్శ్ నగర్‌కు చెందిన యర్రమిల్లి హిమ బిందు వద్దకు ఆమె దూరపు బంధువైన చెరుకుపల్లి లక్ష్మి సర్వాణి (35) కొద్దిరోజుల క్రితం వచ్చింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని చెప్పడంతో మానవత్వంతో హిమ బిందు ఆమెకు తన ఇంట్లోనే ఆశ్రయం కల్పించారు. అయితే ఈ ఆదరణను ఆసరాగా చేసుకున్న లక్ష్మి సర్వాణి ఇంటిని దోచుకోవాలని పథకం పన్నింది. ఈ నెల 13న అదను చూసుకొని ఇంట్లో ఉన్న వారికి మత్తు పదార్థం ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేసింది. అనంతరం తన అనుచరులైన పర్వతం కిరణ్ కుమార్ (30), కొనపర్తి యశ్వంత్ (19), భారడి దిలీప్ (23), శివ సహాయంతో ఇంట్లో ఉన్న విలువైన బంగారు, వెండి ఆభరణాలను దోచుకుని పరారైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బాలానగర్ క్రైమ్ పోలీసులు సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్, సెల్ టవర్ డేటాను విశ్లేషించి దర్యాప్తు చేపట్టారు. నిందితులు తప్పించుకునేలోపే శనివారం వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితురాలు లక్ష్మి సర్వాణితో పాటు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా, శివ అనే వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

నిందితుల వద్ద నుంచి సుమారు రూ.50 లక్షల విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో 30 తులాల బంగారం, 2.3 కిలోల వెండి ఆభరణాలు, నాలుగు సెల్ ఫోన్లు ఉన్నాయి. కేసు నమోదైన 24 గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకుని సొత్తును రికవరీ చేసిన బాలానగర్ సీఐ నర్సింహా రాజు, క్రైమ్ బృందాన్ని ఏసీపీ నరేష్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా సిబ్బందికి నగదు పురస్కారాలను ఏసిపి అందజేశారు.