అసలే ప్రభుత్వ స్థలం…ఆపై ఆక్రమ షెడ్డు ..
డి. పోచంపల్లి గ్రామం సర్వే నెంబర్ 169లో
మొదట కూల్చారు… ఆపై నిలిపారు
ప్రజా ప్రతినిధుల అండదండలు.. అధికారుల చేయూత
ఫిర్యాదులు అందినా పట్టింపులేని యంత్రాంగం
దుండిగల్ (న్యూస్ విధాత్రి), జూలై 4: రింగ్ రోడ్డుకు వెళ్లే ప్రధాన రహదారి పక్కనే ఉన్న కోట్ల రూపాయిలు విలువ చేసే ఆ స్థలం ప్రభుత్వ భూమిగా రికార్డులు చెప్పుతున్నాయి.. ఆ స్థలం కబ్జాకు గురైనా ఆటు రెవెన్యూ అధికారులకు పట్టదు. సదరు స్థలంలో ఎటువంటి అనుమతులు పొందకుండా ఆక్రమ షెడ్లు, నిర్మాణాలు చేపట్టినా.. ఇటు మున్సిపల్ అధికారులకూ కానరాదు. దీంతో ఓ పక్క ప్రజాప్రతినిధుల అండదండలు, మరో పక్క అధికారుల చేయూతతో అక్రమార్కులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ స్థలాలతో పాటు ప్రభుత్వ ఖాజానాను కొల్లగొడుతూ పబ్బం గడుపుతున్నారు.

• అదిలో అడగింత…ఆపై ఆక్రమ షెడ్డు నిర్మాణానికి చేయూత
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీలోని దొమ్మర పోచంపల్లి గ్రామ రెవెన్యూ పరిధి గండి మైసమ్మ కూడలి నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వైపు వెళ్లే ప్రధాన రహదారి పక్కన సర్వే నెంబర్ 169లో ఓ వ్యక్తి భారీ షెడ్డు నిర్మాణాన్ని చేశాడు. సంబంధిత అధికారుల నుంచి ఎటువంటి అనుమతులు పొందకుండా అక్రమంగాగా షెడ్డు నిర్మించడమే కాకుండా, నిర్మించిన షెడ్డు స్థలం రెవెన్యూ రికార్డుల ప్రకారం సదరు సర్వే నెంబర్ లో సుమారు 29 గుంటల భూమి ప్రభుత్వ స్థలంగా ఉంది. ఇదే విషయంపై పలువురు రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు కూడా ఫిర్యాదులు అందజేసినట్లు తెలుస్తుంది. అక్రమ షెడ్డు పనులు ప్రారంభించిన వెంటనే మున్సిపల్ ఆధికారులు నిర్మాణ పనులను ఆడుకొని పునాదులను తొలగించారు. అంతే.. ఆనంతరం ప్రజా ప్రతినిధుల అండదండలు, సిఫార్సులే పని చేసాయో …? అధికారులనే ప్రసన్నం చేసుకున్నారో..? మరి ఏ ఇతర పరిణామాలు చోటు చేసుకున్నాయో..? గానీ మొత్తానికి ఆక్రమ షెడ్డును నిరాటంకంగా పూర్తి చేసుకొనే వరకు ఆటువైపు కన్నెత్తి చూడని అధికారులు ప్రారంభోత్సవం వరకు తీసుకు వచ్చి ఆక్రమ షెడ్డును కాస్త సక్రమం చేశారనే వాదనలు బలంగానే వినిపిస్తున్నాయి.
• గతంలోనూ ఇదే తంతు…
అయితే ఇదే వ్యక్తి గతంలోనూ దుండిగల్ మున్సిపల్ పరిధిలో పలు చోట్ల అక్రమ షెడ్లను నిర్మిస్తే వాటిని కూడా ఇదే విధంగా మొదట కూల్చివేతలు చేసిన అప్పటి అధికారులు సైతం బేరసారాలు కుదుర్చుకొని ఆపై అక్రమ షెడ్లు పూర్తి చేసుకునేందుకు పూర్తి సహకారం అందించారని కార్యాలయంలోనే బహిరంగంగానే చర్చించుకోవడం కొసమెరువు. అక్రమార్కులకు అధికారుల అండదండలు మెండుగా ఉండడం వల్లనే దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో పుట్ట గొడుగుల్లా ఆక్రమ భారీ షెడ్లు, నిర్మాణాలు వెలుస్తున్నాయని వినికిడి. మరి ఇప్పటికైనా సంబంధిత అధికారులు వాటిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.