ఆస్తిపన్ను పరిష్కార కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – డిసి లావణ్య

• మార్చి నెలలో ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), మార్చి 6:  ప్రజలకు ఆస్తిపన్ను సంబంధిత సమస్యలను సులభంగా, త్వరితగతిన పరిష్కరించేందుకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సిఎంసి) చింతల్ సర్కిల్ పరిధిలో జీడిమెట్ల సర్కిల్ కార్యాలయంలో మార్చి నెలలో ప్రతి ఆదివారం ప్రత్యేక ఆస్తిపన్ను పరిష్కార కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఈనెల 8, 15, 22, 29వ తేదీల్లో ప్రతి ఆదివారం ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సంబంధిత అధికారులు కార్యాలయంలో అందుబాటులో ఉండి ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు, వినతులు స్వీకరించి వాటిపై తక్షణ చర్యలు తీసుకోనున్నారు. ఈ కార్యక్రమంలో ఆస్తిపన్ను బకాయిలకు సంబంధించిన వివరాలు, పన్ను అంచనాలలో ఉన్న పొరపాట్లు, పేరుమార్పు (మ్యూటేషన్), డబుల్ అసెస్‌మెంట్ సమస్యలు, ఖాళీ స్థలాలు, వినియోగంలో లేని భవనాలపై పన్ను సవరణలు, చెల్లింపులకు సంబంధించిన సందేహాలు, ఆన్‌లైన్ చెల్లింపులలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలు వంటి ఆస్తి పన్నుకు సంబంధించిన ఇతరత్రా అంశాలను పరిష్కరించనున్నారు. ప్రజలు తమ ఆస్తికి సంబంధించిన పత్రాలు (పాత పన్ను రసీదులు, ఆధార్ ప్రతులు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు మొదలైనవి) వెంట తీసుకురావలసిందిగా అధికారులు సూచించారు. వాటిని సంబంధిత అధికారులు తక్షణ పరిశీలన చేసి, సాధ్యమైనంతవరకు అదే రోజు సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నారు.
ప్రజలు ఈ ప్రత్యేక అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ఆస్తిపన్ను సమస్యలను పరిష్కరించుకోవాలని సర్కిల్ ఉప కమిషనర్ లావణ్య విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More