ఏసీబీ ఉచ్చులో చిక్కిన మూసాపేట్ కమ్యూనిటీ ఆర్గనైజర్ మురళి
– రూ. 18000/- లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు
కూకట్‌పల్లి (న్యూస్ విధాత్రి), మార్చి 10: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూకట్‌పల్లి జోన్ పరిధి మూసాపేట్ సర్కిల్లో కమ్యూనిటీ ఆర్గనైజర్ (సివో) గా విధులు నిర్వహిస్తున్న కె. మురళి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల ఉచ్చులో మంగళవారం చిక్కాడు. ఒక మహిళా పొదుపు సంఘానికి మంజూరైన రూ.20 లక్షల రుణాన్ని ప్రాసెస్ చేయడానికి లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

వివరాల ప్రకారం, ఆ రుణాన్ని ప్రాసెస్ చేయడంలో సహకరించడానికి ప్రతి లక్షకు రూ.1,000 చొప్పున మొత్తం రూ.18,000 లంచంగా ఇవ్వాలని మురళి డిమాండ్ చేసినట్లు సమాచారం. దీనిపై బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అధికారులు పథకం ప్రకారం ఉచ్చు వేసి బాధితుల నుంచి రూ.18,000 లంచం స్వీకరిస్తున్న సమయంలో మురళిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.