~ 1,080 పిత్తాశయ రాళ్లు విజయవంతంగా తొలగింపు
~ వైద్య రంగంలో అరుదైన ఘట్టం
హైదరాబాద్ (న్యూస్ విధాత్రి), ఫిబ్రవరి 17: నగరంలోని చందానగర్‌లో ఉన్న ఒమేగా పిఆర్కే ఆసుపత్రిలో వైద్య చరిత్రలో నిలిచిపోయే అరుదైన శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు, జీర్ణ సమస్యలతో బాధపడుతున్న ఒక రోగి ఆసుపత్రికి రాగా, సమగ్ర వైద్య పరీక్షలు అనంతరం అతనికి క్యాల్క్యులస్ కొలెసిస్టిటిస్ ( పిత్తాశయంలో రాళ్ల (గాల్ స్టోన్స్) కారణంగా వచ్చే పిత్తాశయ వాపు/మంట) అని నిర్ధారణ అయింది. క్యాల్క్యులస్ కొలెసిస్టిటిస్ అనేది పిత్తాశయంలో రాళ్లు ఏర్పడి వాపు, ఇన్‌ఫెక్షన్ ను కలిగిస్తుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. రోగికి అల్ట్రాసౌండ్ ఇతర స్కానింగ్ పరీక్షలు చేయగా, పిత్తాశయం పూర్తిగా రాళ్లతో నిండిపోయినట్లు వైద్యులు గుర్తించారు.
• 1,080 పిత్తాశయ రాళ్లు తొలగించిన వైద్యులు…
వైద్య బృందం లాపరోస్కోపిక్ కొలెసిస్టెక్టమీ (Laparoscopic Cholecystectomy) అనే అత్యాధునిక సూక్ష్మ శస్త్రచికిత్స పద్ధతిలో చిన్న చీలికల ద్వారా కెమెరా, ప్రత్యేక శస్త్ర పరికరాల సహాయంతో శస్త్రచికిత్స చేశారు. శస్త్రచికిత్స సమయంలో వైద్యులు ఏకంగా మొత్తం 1,080 పిత్తాశయ రాళ్లు గుర్తించి వాటిని సురక్షితంగా తొలగించారు. ఇంకా పెద్ద మొత్తంలో రాళ్లు తొలగించడం అరుదైన సంఘటనగా వైద్య వర్గాలు పేర్కొన్నారు. ఈ క్లిష్టమైన శస్త్రచికిత్సను చీఫ్ సర్జన్ డాక్టర్ పట్వాడి అజయ్ కుమార్ నాయకత్వంలో అనస్థీషియా నిపుణులు డాక్టర్ రాజేష్, డాక్టర్ మోనికా, నర్సింగ్ సిబ్బంది పద్మలత, ఆపరేషన్ థియేటర్ సిబ్బంది సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు. వైద్యుల అనుభవం, అత్యాధునిక సాంకేతిక పరికరాలు, వైద్య బృందం సమన్వయం అరుదైన శస్త్రచికిత్సకు కీలకంగా నిలిచాయి.

• పిత్తాశయ రాళ్లను నిర్లక్ష్యం చేస్తే…
తీవ్రమైన ఇన్‌ఫెక్షన్, పిత్తాశయం పగిలిపోవడం,
ప్యాంక్రియాటిటిస్, జాండిస్ (పచ్చకామెర్లు) వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. అందువల్ల ప్రారంభ దశలోనే పరీక్షలు చేయించుకుని చికిత్స పొందడం అత్యంత అవసరమని వారు తెలిపారు.
• కోలుకుంటున్న బాధితుడు…
శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయ్యిందని, ప్రస్తుతం రోగి ఆరోగ్యం స్థిరంగా ఉండి వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారని ఆసుపత్రి ఎమ్.డి డాక్టర్ పి. రవికుమార్ చెప్పారు. ఈ అరుదైన శస్త్రచికిత్సతో ఒమేగా పిఆర్కే ఆసుపత్రి హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలో అత్యాధునిక సూక్ష్మ శస్త్రచికిత్సలలో విశ్వసనీయత అగ్రగామి వైద్య కేంద్రంగా మరోసారి తన ప్రతిష్టను చాటుకుంది.