కాంగ్రెస్ గూటికి మాజీ కార్పొరేటర్ కేఎం. గౌరీష్
• తనయుడు గిరిధర్ తో కలిసి చేరిక
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), ఫిబ్రవరి 22: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ రాజకీయాల్లో ఊహించని మలుపు తిరిగింది. బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ స్వయాన బాబాయి, మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ బీఆర్ఎస్కు రాజీనామా చేసి తన కుమారుడు గిరిధర్ తో కలిసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం స్థానిక రాజకీయాల్లో పెద్ద చర్చకు దారి తీసింది.
• అభివృద్ధి పేరుతో మార్పా… లేక వ్యూహాత్మక నిర్ణయమా..?
కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా గౌరీష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితుడై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే వేదికగా కాంగ్రెస్ పార్టీ కనిపించిందని స్పష్టం చేశారు. అయితే రాజకీయ వర్గాల్లో మాత్రం “ఇది కేవలం సిద్ధాంత మార్పు కాదు… సమీకరణాల మార్పు” అన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఎమ్మెల్యేకు అత్యంత సమీప బంధువే పార్టీని వీడటం బీఆర్ఎస్ శ్రేణుల్లో కలకలం రేపింది. ముఖ్యంగా పెరిగిన జిహెచ్ఎంసి డివిజన్లు, రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.

• కాంగ్రెస్ శిబిరంలో జోష్…
కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి, టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి ఆధ్వర్యంలో, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో ఆయనకు పార్టీ కండువా వేసి ఘనంగా ఆహ్వానించారు. గౌరీష్ వంటి సీనియర్ నాయకుడి చేరికతో కుత్బుల్లాపూర్‌లో కాంగ్రెస్ బలం రెట్టింపు అవుతుందని వారు వ్యాఖ్యానించారు. గౌరీష్ తో పాటు గణేష్ నగర్ డివిజన్‌కు చెందిన పలు బస్తీల అధ్యక్షులు, కార్యకర్తలు కూడా కాంగ్రెస్‌లో చేరడం విశేషం. ఎమ్మెల్యే సొంత బాబాయి పార్టీ మారడం కేవలం స్వలాభం కోసమేనని, ఎటువంటి ప్రజా ప్రయోజనం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి రాబోయే రోజుల్లో, ఎన్నికలలో ఈ మార్పు ఎంతవరకు ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. ఈ కార్యక్రమం లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గ్రంధాలయ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు