కుత్బుల్లాపూర్‌లో మళ్లీ గులాబీ జెండా ఎగరాలి. – ఎమ్మెల్యే వివేకానంద్

• అభ్యర్థి ఎవరైనా సరే… పార్టీ ప్రకటించిన అభ్యర్థి గెలుపే లక్ష్యం
• కొందరు నాయకులు పార్టీని వీడినంత మాత్రానా పార్టీకి నష్టం లేదు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), ఫిబ్రవరి 23: అభ్యర్థి ఎవరైనా సరే… పార్టీ ప్రకటించిన అభ్యర్థి గెలుపే లక్ష్యం. కుత్బుల్లాపూర్‌లో మళ్లీ గులాబీ జెండా రెపరెపలాడేలా ప్రతి నాయకుడు, కార్యకర్త సమన్వయంతో కృషి చేయాలని బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ పిలుపునిచ్చారు. సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ (ఎమ్మెల్యేకు స్వయానా బాబాయి) బిఆర్ఎస్ పార్టీను వీడి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చింతల్‌లోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కుత్బుల్లాపూర్ డివిజన్ స్థాయి సమన్వయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా సోమవారం హాజరయ్యారు. రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం తీసుకోవాల్సిన వ్యూహాలు, చేపట్టవలసిన చర్యలపై నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.

సమన్వయ సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వివేకానంద్

• పార్టీ అన్నిటికంటే గొప్పది…క్యాడర్ మన బలం..
పార్టీ వ్యక్తుల కంటే గొప్పదని, క్యాడర్ పార్టీకి అసలు బలమని స్పష్టం చేశారు. కొందరు నాయకులు పార్టీని వీడినంత మాత్రానా పార్టీకి నష్టం లేదని, నాయకునితో సంబంధం లేకుండా పార్టీ నిర్ణయం తీసుకున్న అభ్యర్థి గెలుపుకై కృషి చేయడం వల్లనే గత 12 ఏళ్లలో కుత్బుల్లాపూర్‌తో పాటు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగిందన్నారు. కుత్బుల్లాపూర్‌లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇప్పటికే మూడు సార్లు గుణపాఠం చెప్పారని, అయినా వారు మారలేదని ఎమ్మెల్యే విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లోపం కారణంగా ఇతర పార్టీల నాయకులను ప్రలోభాలకు గురిచేస్తూ పార్టీలో చేర్చుకోవడం హేయమైన చర్య అని మండిపడ్డారు.
• అభివృద్ధే అజెండా.. గెలుపే లక్ష్యం…
నియోజకవర్గంలోని అన్ని డివిజన్లు, కాలనీలలో మౌలిక వసతుల అభివృద్ధి జరిగిందని, రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేపడతామని హామీ ఇచ్చారు. గత 12 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు గుర్తుచేస్తూ ఎన్నికల బరిలోకి వెళ్లాలని సూచించారు. కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని, సముచిత గుర్తింపు, స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. గతంలో పనిచేసిన స్ఫూర్తితోనే మళ్లీ కృషి చేస్తే గులాబీ జెండా మరోసారి కుత్బుల్లాపూర్‌లో రెపరెపలాడుతుందని కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.
ఈ సమావేశంలో కుత్బుల్లాపూర్ యూత్ అధ్యక్షుడు దూదిమెట్ల సోమేశ్ యాదవ్, బిఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి, సీనియర్ నాయకులు సంపత్ మాధవరెడ్డి, కిషోర్ చారి, వివిధ కాలనీలు, బస్తీల సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులు, ముఖ్య నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More