కుత్బుల్లాపూర్ మండలంలో సాయి లత మోడల్ స్కూల్ విద్యార్థినికి టాప్ ర్యాంక్
షాపూర్ నగర్ (న్యూస్ విధాత్రి), ఏప్రిల్ 29: కుత్బుల్లాపూర్ మండలంలో పదవ తరగతి పరీక్ష ఫలితాలలో షాపూర్ నగర్‌లోని సాయి లత మోడల్ స్కూల్ విద్యార్థిని వై. భవ్య శ్రీ అద్భుత ప్రతిభ కనబరిచి 600 మార్కులకు గాను 593 మార్కులు సాధించి మండలంలో టాప్ ర్యాంకర్‌గా నిలిచింది. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం ఆమెను ఘనంగా సత్కరించింది.
ఈ విజయంపై పాఠశాల కరస్పాండెంట్ జనార్ధన్ దయాకర్ ఆనందం వ్యక్తం చేస్తూ, తమ విద్యార్థిని అత్యుత్తమ మార్కులు సాధించడం గర్వకారణమన్నారు. పాఠశాల నుంచి ఈ ఏడాది పదవ తరగతి పరీక్షలకు హాజరైన 35 మంది విద్యార్థులంతా ఉత్తీర్ణత సాధించడం విశేషమని తెలిపారు. విద్యార్థులు ఇదే ఉత్సాహంతో ఉన్నత చదువుల్లో కూడా ప్రతిభ కనబరిచి ఉన్నత స్థానాలు చేరుకోవాలని ఆకాంక్షించారు.