ఘనంగా ఏఎంసీ చెవ్వ కృష్ణ పదవీ విరమణ ఆత్మీయ వీడ్కోలు సమావేశం

కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), సెప్టెంబర్ 30:  తొలుత మున్సిపల్ అనంతరం జిహెచ్ఎంసి రెవెన్యూ శాఖలో గత నాలుగు దశాబ్దాలుగా వివిధ హోదాల్లో విధులు నిర్వహించి ప్రస్తుతం కుత్బుల్లాపూర్ సర్కిల్ లో సహాయ మున్సిపల్ కమిషనర్ (ఏఎంసీ)గా విశిష్టమైన సేవలందించిన చెవ్వ కృష్ణ పదవీ విరమణ పొందిన సందర్భంగా వీడ్కోలు సభను సహచరులు మంగళవారం ఘనంగా నిర్వహించారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఏఎంసి కృష్ణ

గాజులరామారంలోని మహారాజా గార్డెన్స్ లో నిర్వహించిన ఈ సభలో ఉప కమిషనర్లు వి నరసింహ, మల్లారెడ్డి, సేవా ఇస్లావత్, తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తిప్పర్తి యాదయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ పి. జగన్ మోహన్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. వారు మాట్లాడుతూ ప్రతిఒక్కరి ఉద్యోగ జీవితం కేవలం పనితీరుతో మాత్రమే కాకుండా, వారి వ్యక్తిత్వం, సహచరులతో కలిసి పనిచేసే ధోరణి, నిజాయితీ, క్రమశిక్షణలతో ముడిపడి ఉంటుందన్నారు. ఆ దిశగా ఏఎంసీ కృష్ణ అందరికీ ఆదర్శప్రాయులని, సమాజం పట్ల ఉన్న బాధ్యతతో ఆయన చేసిన సేవలు ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయన్నారు. ఆయన పదవీకాలమంతా విధి నిర్వహణలో అత్యుత్తమ నిబద్ధతను ప్రదర్శించారన్నారు. సహచరులకు ఎల్లప్పుడూ అండగా నిలిచి, సమస్యలను పరిష్కరించడంలో ముందుండేవారని ప్రశంసించారు.

సహోద్యోగులతో ఏఎంసీ కృష్ణ దంపతులు

ఆయన చిన్ననాటి స్నేహితులు మాట్లాడుతూ… ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఉన్నత విద్యాభ్యాసాన్ని అభ్యసించి సాధారణ ఉద్యోగి నుండి ఉన్నత స్థాయికి ఎదిగి, నిజాయితీతో విధులు నిర్వర్తించడం ఒక గొప్ప విషయమని కొనియాడారు. పదవీ విరమణ అనంతరం కూడా వారి అనుభవంతో సమాజానికి సేవ చేయగల సామర్థ్యం ఉద్యమకారుడైన ఆయనలో ఉందన్నారు. ఆయన నూతన జీవిత అధ్యాయం మరింత సంతోషభరితంగా సాగాలని ఆకాంక్షించారు. సభలో ప్రసంగించిన అనేక మంది సహచరులు ఆయనతో గడిపిన అనుభవాలను స్మరించుకుని అవసరమైనప్పుడల్లా అందుబాటులో ఉండే సహోద్యోగి, మానవతా విలువలను కాపాడే మంచి మనిషి అంటూ కృతజ్ఞతలు తెలిపారు. చివరిగా ఏఎంసీ కృష్ణ మాట్లాడుతూ…తన పదవీ విరమణ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ఉద్యోగం నాకు అందించిన గుర్తింపు, సహచరుల ప్రేమ, మిత్రభావం జీవితాంతం మరిచిపోలేనివి. పదవీ విరమణ అంటే విశ్రాంతి మాత్రమే కాదని, సమాజానికి మరింత దగ్గర కావడానికి అవకాశమని భావిస్తున్నాను అన్నారు. మనం చేసే పని మీద పట్టుదల, కృషి ఉన్నప్పుడే ముందుకు సాగుతామన్నారు. అందరి సహాయ, సహకారాలు, సూచనలు, అభిమానంతోనే సంవత్సరాల తరబడి సర్విస్ చేయగలిగానన్నాడు. తన సర్వీస్ కాలంలో ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించాలని కోరారు. పదవీకాలంలో ప్రధానంగా కుటుంబ సభ్యుల చేయూత ఎంతో అవసరమని తెలిపారు. అనంతరం అనంతరం సహోద్యోగులు ఆయనకు శాలువాలు కప్పి, పుష్పగుచ్చాలు, జ్ఞాపికలు అందజేసి ఘనంగా సన్మానించారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా హాజరై అందరి శుభాకాంక్షలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీలు శ్రీకాంత్ రెడ్డి, నర్సింగ్ రావు, ప్రమీల, హరిబాబు, రవీందర్, శ్రీనివాస్ గౌడ్, సూపరింటెండెంట్లు గిరిబాబు, జవహర్ లాల్, పద్మభూషణ్ రాజ్, జిహెచ్ఎంసి రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు రవి, ఈఈ లక్ష్మీ గణేష్, జిహెచ్ఎంసి లోని వివిధ సర్కిలలోని టాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More