జీడిమెట్ల సర్కిల్లో ఉప కమిషనర్ తీరుపై తీవ్ర ఆరోపణలు
• వ్యక్తిగత కక్షతో వేధింపులు.. అధికార దుర్వినియోగం..అంటూ మహిళా ఉద్యోగిని ఫిర్యాదు
• ప్రజాభవన్‌ను ఆశ్రయించిన ఎస్ఎఫ్ఏ జానకి
• సమగ్ర విచారణకు డిమాండ్
హైదరాబాద్/కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 23:
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జీడిమెట్ల సర్కిల్లో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగిని (ఎస్ ఎఫ్ ఏ) జి.వి.ఎస్. జానకి, ఉప కమిషనర్ శంకర్ సింగ్‌పై సంచలన ఆరోపణలు చేస్తూ ప్రజాభవన్‌లో మంగళవారం ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. డీసీ శంకర్ సింగ్ తన అధికారాన్ని ఉపయోగించి ఆయన సర్కిల్ కు వచ్చిన మొదటి రోజు నుంచే తనను లక్ష్యంగా చేసుకుని మానసికంగా వేధిస్తున్నారని, విధుల్లో ఇబ్బందులు సృష్టిస్తున్నారని జానకి ఆరోపించారు. సహోద్యోగులు, కార్మికుల సమక్షంలో పలుమార్లు అవమానకర వ్యాఖ్యలు చేసి తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారని ఆమె వినతిపత్రంలో పేర్కొన్నారు.
• పలువురికి ఫిర్యాదు చేసిన ఫలితం శూన్యం…
ఉద్యోగ సంబంధిత సమస్యలను వివరించేందుకు ప్రయత్నించిన ప్రతిసారి తనకు అవకాశం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఫిర్యాదులు చేసిన తర్వాత కూడా వేధింపులు మరింత పెరిగాయని ఆమె ఆరోపించారు. గత రెండు నెలలుగా కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, రాష్ట్ర మహిళా కమిషన్లకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
• తీవ్ర మానసిక ఒత్తిడి ఎదుర్కుంటున్న…
ఒక వితంతువుగా ఇద్దరు పిల్లల భవిష్యత్తు బాధ్యతల మధ్య ఉద్యోగం చేస్తున్న తనను లక్ష్యంగా చేసుకుని వ్యవహరించడం మానవతా విలువలకు విరుద్ధమని ఆమె పేర్కొన్నారు. గతంలో తన పనితీరుకు పలువురి అధికారుల నుంచి ప్రశంసలు అందుకున్నప్పటికీ ప్రస్తుతం ఎదురవుతున్న పరిస్థితులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయని తెలిపారు.
• నిబంధనల ప్రకారం నియామకం జరిగిందా…? లేదా…?
అంతేకాకుండా, డిప్యూటీ కమిషనర్ శంకర్ సింగ్ కుమార్తె జయశ్రీ ప్రస్తుతం కూకట్పల్లి జోన్‌లోని ఎస్ఈ సెక్షన్లో పనిచేస్తున్నట్లు సమాచారం ఉందని, ఆమె నియామకం లేదా విధుల్లో కొనసాగింపుకు సంబంధించి అవసరమైన పరిపాలనా అనుమతులు ఉన్నాయా..? లేదా..? అనే అంశంపై సందేహాలు ఉన్నాయని వినతిపత్రంలో పేర్కొన్నారు. విధుల్లో కొనసాగింపుకు సంబంధించిన అంశాలపై కూడా సంబంధిత రికార్డులను పరిశీలించి అన్ని నిబంధనల ప్రకారం నియామకం జరిగిందా…? లేదా…? అనే విషయాన్ని వెలుగులోకి తీసుకురావాలని కోరారు.
• ప్రజాభవన్‌కు సమర్పించిన వినతిపత్రంలో…
ప్రజాభవన్‌కు సమర్పించిన వినతిపత్రంలో జానకి చేసిన పలు డిమాండ్లు ఇలా ఉన్నాయి…
~ వెంటనే ఆమె లాగిన్‌ను పునరుద్ధరించాలి.
~ తన ఫిర్యాదులపై స్వతంత్ర, నిష్పాక్షిక విచారణ జరపాలి.
~ మానసిక వేధింపులు, అవమానకర ప్రవర్తన, అధికార దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలి.
~ జయశ్రీ నియామకం/విధుల్లో కొనసాగింపుకు సంబంధించిన రికార్డులను పరిశీలించి వాస్తవాలను నిర్ధారించాలి.
~ విచారణ పూర్తయ్యే వరకు తనపై ఎటువంటి ప్రతీకార చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పించాలి.
~ తనకు ప్రశాంతంగా, గౌరవప్రదంగా విధులు నిర్వహించే అవకాశం కల్పించాలని జానకి ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పుడు ప్రజాభవన్‌కు చేరిన ఈ ఫిర్యాదుపై ప్రభుత్వం, సంబంధిత అధికారులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఉప కమిషనర్ శంకర్ సింగ్ వివరణ తీసుకునేందుకు విధాత్రి ప్రతినిధి పలుమార్లు ఫోన్ చేసినా ఆయన స్పందించలేదు.