నేడు దుండిగల్ మున్సిపాలిటీలో కుక్కలకు ఉచిత వ్యాక్సినేషన్ శిబిరం
దుండిగల్ (న్యూస్ విధాత్రి), సెప్టెంబర్ 9 : పెంపుడు కుక్కలు కలిగిన వారు, వీధి కుక్కలకు ఆహారం అందించే జంతు ప్రేమికులు ఉచిత వ్యాక్సినేషన్ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని దుండిగల్ మున్సిపల్ కమిషనర్ ఎన్. వెంకటేశ్వర్ నాయక్ సూచించారు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటివరకు 2,659 వీధి కుక్కలను గుర్తించారు. అందులో బ్లూ క్రాస్ సొసైటీ భాగస్వామ్యంతో ఇప్పటివరకు 1,874 కుక్కలకు స్టెర్లైజేషన్, యాంటీ రేబీస్ టీకాలు అందించారు.
బ్లూ క్రాస్ సొసైటీ అన్ని వార్డుల్లోనూ వీధి కుక్కలను పట్టుకొని శస్త్రచికిత్సలు, టీకాలు వేస్తున్నారు. అదేవిధంగా, ప్రతి మూడు నెలలకు ఒకసారి వీధి కుక్కలు, పెంపుడు కుక్కలకు ఉచిత వ్యాక్సినేషన్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం (09-09-2025) దుండిగల్ వార్డ్ ఆఫీసులో ఉచిత వ్యాక్సినేషన్ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవడంతో పాటు చిన్నపిల్లలను వీధి కుక్కల దగ్గరికి వెళ్లనీయకూడదని, పిల్లలున్న తల్లి కుక్కల దగ్గరికి వెళ్లరాదని, కుక్కలకు ఆహారం, నీరు ఇచ్చేటప్పుడు జన సంచారం లేని ప్రదేశాలను ఎంచుకోవాలని కమిషనర్ వెంకటేష్ నాయక్ సూచించారు. వీధి కుక్కలకు సంబంధించిన సమస్యలు ఉంటే 8885343470, 7995824443 నంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లూ క్రాస్ సొసైటీ ప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.