పారిశుద్ధ్య ప్రత్యేక డ్రైవ్ పై జెడ్సీ విస్తృత తనిఖీలు
• కుత్బుల్లాపూర్ జోన్ లో పలు ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), ఫిబ్రవరి 3: పారిశుద్ధ్య ప్రత్యేక డ్రైవ్ సందర్భంగా జిహెచ్ఎంసి కుత్బుల్లాపూర్ జోన్ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరచే దిశగా జోనల్ కమిషనర్ సందీప్ కుమార్ ఝా విస్తృత స్థాయి తనిఖీలను మంగళవారం నిర్వహించారు. జీడిమెట్ల సర్కిల్ పరిధిలోని సుచిత్ర ప్రధాన రహదారి, పైప్లైన్ రోడ్డు ప్రాంతాల్లో నిర్వహించిన ఈ తనిఖీల్లో పారిశుద్ధ్య డ్రైవ్ అమలు తీరును జెడ్సి ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జీడిమెట్ల సర్కిల్ ఉప కమిషనర్ శంకర్ సింగ్ తో పాటు జోనల్ స్థాయి అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు. రోడ్లపై చెత్త సేకరణ, డంపింగ్ పాయింట్ల తొలగింపు, డ్రైనేజీ శుభ్రత, అధిక జనసంచార ప్రాంతాల్లో పరిశుభ్రత వంటి అంశాలను సమగ్రంగా సమీక్షించారు.
ముఖ్యంగా సుచిత్ర ప్రధాన రహదారి వంటి రద్దీ ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శుభ్రత చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అనధికార చెత్త నిల్వలు, డ్రైనేజీ బ్లాకేజీలు ఉన్న చోట్ల తక్షణమే చర్యలు తీసుకోవాలని, రోజువారీ చెత్త సేకరణను క్రమబద్ధంగా నిర్వహించాలని జెడ్సి ఆదేశించారు.