పార్టీ మారినా… కలిసిరాని క్యాడర్…
• పైగా తమ నేత పార్టీ వీడినందుకు సంబరాలు
• కుత్బుల్లాపూర్ లో చోటు చేసుకున్న వింత పరిణామం
• కాంగ్రెస్ లో చేరిన మాజీ కార్పొరేటర్ కేయం. గౌరీష్
• బిఆర్ఎస్ లో బహిర్గతమైన అంతర్గత అసంతృప్తి, అసహనం
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), ఫిబ్రవరి 23: వారంతా ఒకప్పుడు ఆయన అనుచరులే, అనునిత్యం సలహాలు, సూచనలు చేస్తూ ఆయన వెన్నంటి నడిచినవారే.. అతని సేనగా ఉన్నవారే… కానీ నేడు అసహనమో… అసంతృప్తో… మరి రాజకీయ సమీకరణాలో తెలియదు కానీ మొత్తానికి వారంతా ఒక బృందంగా కలిసికట్టుగా ఉండి అతనిపై వ్యతిరేక గళాన్ని వినిపించడం గమనార్హం. కుత్బుల్లాపూర్ రాజకీయాల్లో ఊహించని మలుపు తిరిగింది. బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కెపి వివేకానంద్ స్వయాన బాబాయి, సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్ కే.ఏం. గౌరీష్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన వెంటనే చోటుచేసుకున్న పరిణామాలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.
• పార్టీ వీడితే బాధపడాలి… కానీ ఇక్కడ సంబరాలు ఎందుకు..?
సాధారణంగా ఓ సీనియర్ నేత పార్టీని వీడితే శ్రేణుల్లో ఆవేదన కనిపిస్తుంది. కానీ ఇక్కడ సన్నివేశం పూర్తిగా భిన్నంగా మారింది. గౌరీష్ పార్టీని వీడిన వెంటనే అప్పటివరకు కక్కలేక… మింగలేక… అన్నట్లుగా అసంతృప్తిగా ఉన్న డివిజన్ బీఆర్ఎస్ శ్రేణులే బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకోవడం, మిఠాయిలు పంచుకోవడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. పార్టీలో అంతర్గత అసంతృప్తి అంత తీవ్రంగా ఉందా? అంతర్గత అసహనం బయటపడిందా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

• వారిని కాదని పార్టీ మారినందుకేనా…?
గత కొంతకాలంగా స్థానికంగా నాయకత్వంపై అసంతృప్తి ఉన్నట్టు ప్రచారం సాగింది. ఆ అసహనం ఇప్పుడు పార్టీ మారడంతో బహిరంగ సంబరాల రూపంలో బయటపడిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒక నాయకుడు వెళ్లిపోవడంతో పార్టీ కార్యకర్తలే ఆనందోత్సాహాల్లో మునిగిపోవడం సాధారణ విషయం కాదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే గౌరీష్ ఇటీవల బీజేపీ పార్టీలో చేరుతున్నానననే సంకేతాలను అతని అనుచరులకు, బిఆర్ఎస్ శ్రేణులకు అందించారు. దాంతో వారు ఏకీభవించకపోవడంతో పాటు తీవ్రంగా వ్యతిరేకించి వారంతా బిఆర్ఎస్ లోనే ఉండి ఎమ్మెల్యేకు అండగా నడుస్తామని తెలిపినట్లు సమాచారం. అప్పటి నుంచే వారంతా ఆయనతో అంటి.. ముట్టనట్టుగా, ఎడ మొహం… పెడ మొహం గానే.. ఉన్నారు. ఇది ఇలా ఉండగానే అకస్మాత్తుగా గౌరీష్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం వారిని మరింత విస్మయానికి గురిచేసి ప్రస్తుతం సంబరాలు జరుపుకునే స్థాయికి దారితీసింది.

• మరి కాంగ్రెస్‌కు లాభమా..? నష్టమా..?
గౌరీష్ చేరికతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొనగా, బీఆర్ఎస్‌లో మాత్రం మౌనం కనిపిస్తోంది. అసంతృప్తిగా ఉన్న శ్రేణులు ఇలా బహిరంగంగా సంబరాలు జరుపుకోవడం భవిష్యత్తు రాజకీయ సమీకరణాలకు సంకేతంగా భావిస్తున్నారు. మరి భవిష్యత్తులోనైనా గౌరీష్ ప్రధాన అనుచరులు, కార్యకర్తలు కలిసొస్తారా… లేదా.. అనే మీమాంస నెలకొంది. మరి ఇది కాంగ్రెస్కు లాభమా..? నష్టమా…? అనే చర్చ కూడా జరుగుతుంది.
• వేడెక్కిన రాజకీయ వాతావరణం…
మొత్తంగా గౌరీష్ పార్టీ మార్పు కేవలం ఒక రాజీనామా కాకుండా, స్థానిక బీఆర్ఎస్‌లో ఉన్న విభేదాల్ని బహిర్గతం చేసిన సంఘటనగా మారింది. ఇది ప్రారంభమా? లేక ముగింపా? అనే చర్చ ఇప్పుడు డివిజన్ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. రాబోయే రోజుల్లో మరిన్ని పరిణామాలు చోటుచేసుకునే అవకాశముందని అటు రాజకీయ వర్గాలు, ఇటు ప్రజలు అంచనా చేస్తున్నారు.