• వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి
• వేధించిన కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సోదరుడు కూన శ్రీనివాస్ గౌడ్
• కూనకు చెందిన కాంక్రీట్ క్రషర్ పరిశ్రమలో అకౌంటెంట్ గా పనిచేసే కుమార్ యాదవ్
• పరిశ్రమలో కోటి రూపాయల అవకతవకులు
• కోటి రూపాయలు చెల్లించాలని కుమార్ యాదవ్ ను హింసించిన శ్రీనివాస్ గౌడ్, పరిశ్రమ సిబ్బంది
• మనస్థాపానికి గురై ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న కుమార్ యాదవ్
• తండ్రిని కోల్పోయిన 26 రోజుల పసికందు (పాప)
• కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న కూకట్పల్లి పోలీసులు
కూకట్ పల్లి (న్యూస్ విధాత్రి), జూలై 28: కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సోదరుడు కూన శ్రీనివాస్ గౌడ్ వేధింపులు తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్నేహితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కూకట్‌పల్లిలోని వెంకట్రావు నగర్ రోడ్ నెంబర్ -10కి చెందిన అంకెనపల్లి కుమార్ యాదవ్ కూన శ్రీనివాస్ గౌడ్ కు చెందిన బాచుపల్లిలోని సమ్మక్క సారక్క కాంక్రీట్ క్రషర్లో గత 8 సంవత్సరాలుగా అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. కుమార్ యాదవ్ కు భార్య బావోజు మౌనిక, 26 రోజుల పాప ఉన్నారు. కుమార్ యాదవ్ పనిచేస్తున్న క్రషర్ లో ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు దొర్లాయని, దానివల్ల కోటి రూపాయలు నష్టం వాటిల్లిందని కుమార్ యాదవ్ పై నింద మోపారు. దీంతో గత 10 రోజులుగా జరిగిన నష్టానికి కోటి రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కూన శ్రీనివాస్ గౌడ్, క్రషర్ కార్యాలయ సిబ్బంది వేధించడంతోపాటు నానా విధాల హింసించారని తన భర్త తనతో తెలిపినట్లు కుమార్ యాదవ్ భార్య మౌనిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. 27వ తేదీన క్రషర్ కార్యాలయం నుంచి కుమార్ యాదవ్ కు ఫోన్ చేసి వెంటనే కార్యాలయానికి రావాలని బెదిరించారు. తాను రాకపోతే వారే అతని ఇంటికి వచ్చి అతని భార్యతో పాటు తల్లిదండ్రులను వేధిస్తామని తెలిపారు. దీంతో అక్కడికి వెళ్లడంతో కుమార్ యాదవ్ గుర్తింపు కార్డులు ( ఐడి కార్డులు), సెల్ ఫోన్, కారు లాక్కొని కొట్టారు. అలాగే అతని ఫోన్లోని వ్యక్తిగత సమాచారం ఆధారంగా వారు పలువురికి ఫోన్లు చేసి తన భర్తను అవమానించారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా వారు అతని బ్యాంక్ ఖాతాను తనిఖీ చేసి, ఖాతా బ్యాలెన్స్ తమదేనని తెలిపారని ఆమె తెలిపింది. 25వ తేదీన కుమార్ యాదవ్ ను అతని తల్లితో సహా ఆఫీసుకు పిలిపించి కొట్టబోతుండగా అతని తల్లి సర్ది చెప్పి 28వ తేదీన సదరు విషయంపై చర్చిస్తామని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కానీ.. ఒకరోజు ముందే 27వ తేదీన మళ్లీ కుమార్ యాదవ్ కు వారు ఫోన్ చేసి ఆఫీసుకు రమ్మని మరోమారు కొట్టి, అసభ్యకర పదజాలంతో దూషించి తీవ్రంగా అవమానించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన కుమార్ యాదవ్ అదే రోజు అర్ధరాత్రి సుమారు 12:30 గంటలకు తొలుత తన భార్యకు, అనంతరం స్నేహితులకు ఫోన్ చేసి, జరిగిన విషయాన్ని తెలిపి మానసికంగా నిరాశ చెందాడు. మనస్థాపానికి గురైన కుమార్ యాదవ్ 28వ తేదీ ఉదయం తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. తన భర్త చావుకు కారణమైన కూన శ్రీనివాస్ గౌడ్, క్రషర్ కార్యాలయ సిబ్బందిపై చట్టరీత్యా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో మౌనిక అందించిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.