మామూళ్ళు ఇస్తేనే… హాజరు నమోదు..
• పారిశుధ్య కార్మికులపై ఎస్ఎఫ్ఏ జులూం
• కార్మికుల ఆందోళన…అపురూప కాలనీలో నిలిచిన పారిశుధ్య సేవలు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 14: సుభాష్‌నగర్ డివిజన్ పరిధిలోని అపురూప కాలనీ, ఎస్ఆర్ నాయక్‌నగర్ ప్రాంతాల్లో పారిశుధ్య సేవలు పూర్తిగా స్తంభించడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పారిశుద్ధ్య ఎస్ఎఫ్ఏ ( సానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్) మొగులయ్య వ్యవహార శైలికి నిరసనగా పారిశుధ్య కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం. స్థానికుల కథనం ప్రకారం…ఎస్ఆర్ నాయక్‌నగర్‌కు సంబంధించిన ఎస్ఎఫ్ఏ మొగులయ్య గత కొంతకాలంగా పారిశుధ్య కార్మికులను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు స్థానిక బీఆర్ఎస్ నాయకుడు గుబ్బల లక్ష్మీనారాయణ, ఎస్ఆర్ నాయక్‌నగర్ మాజీ అధ్యక్షుడు ఆలూరి వెంకట శేషాచారి దృష్టికి కార్మికులు తీసుకెళ్లినట్లు తెలిసింది. శనివారం ఉదయం విధులకు వచ్చిన 9 మంది పారిశుధ్య కార్మికులు కేవలం ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చారనే కారణంతో సూపర్వైజర్ మొగులయ్య వారికి హాజరు నమోదు చేయకుండా ఇంటికి పంపించినట్లు కార్మికులు ఆరోపిస్తున్నారు. దీంతో అపురూప కాలనీతో పాటు ఎస్ఆర్ నాయక్‌నగర్ ప్రాంతాల్లో నిర్వహించాల్సిన పారిశుధ్య పనులు నిలిచిపోయాయి. కార్మికులు విధులకు దూరంగా ఉండటంతో చెత్త సేకరణ, వీధుల పరిశుభ్రత పనులు జరగక కాలనీవాసులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ముఖ్యంగా వర్షాకాలం నేపథ్యంలో పారిశుధ్య పనులు నిలిచిపోవడం ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు, హాజరు నమోదు చేయాలంటే నెలనెలా మామూలు ఇవ్వాలని ఎస్ఎఫ్ఏ కార్మికులపై ఒత్తిడి తెస్తున్నారని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై లక్ష్మీనారాయణ, వెంకట శేషాచారి, పి.వి. భాస్కర్ రెడ్డి కలిసి జోనల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసి, పరిస్థితిని వివరించినట్లు సమాచారం. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణమే సమస్యను పరిష్కరించాలని, ఎస్ఎఫ్ఏ వ్యవహారంపై కూడా సమగ్ర విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. అవసరమైతే సంబంధిత సూపర్వైజర్ను మార్చి, పారిశుధ్య సేవలు సజావుగా కొనసాగేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.