రాజకీయ కక్షసాధింపుతో అంగవైకల్యం కలిగిన యువకుడి వాటర్ ప్లాంట్ సీజ్
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), ఆగస్టు 29: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జగద్గిరిగుట్టలో బిజెపి నాయకుడైన పున్నారెడ్డి కుమారుడు, అంగవైకల్యం (మూగ, చెవిటి)తో బాధపడుతున్న ఉదయ్ నిర్వహిస్తున్న వాటర్ ప్లాంట్‌ను స్థానిక ఎమ్మార్వో అధికారులు సీజ్ చేశారు. ఈ చర్యలో స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే సహకారం ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం అదే ప్రాంతంలో నడుస్తున్న 40 వాటర్ ప్లాంట్లు యథావిధిగా కొనసాగుతున్నప్పటికీ, కేవలం ఉదయ్ ప్లాంట్‌ను మాత్రమే సీజ్ చేయడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని బీజేపీ నాయకులు విమర్శించారు. ప్రత్యేకించి వినాయక నవరాత్రుల సందర్భంగా వినాయక మండపాలకు ఉచితంగా నీటి సరఫరా అందిస్తున్న సమయంలో రాజకీయ కారణాలతో ప్లాంట్‌ను మూసివేయడం ప్రజలకు అన్యాయం చేయడమేనని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై బీజేపీ నాయకులు, బాధితులతో కలిసి కుత్బుల్లాపూర్ ఎమ్మార్వో కార్యాలయంలో అధికారులకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే వివేకానంద్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. నియోజకవర్గంలో వేలకోట్ల విలువచేసే ప్రభుత్వ స్థలాలను కాపాడలేని ఎమ్మెల్యే ఒక అంగవైకల్యం కలిగిన యువకుడి వాటర్ ప్లాంట్ ను సీజ్ చేయించడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. నియోజకవర్గంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో పాటు ఎమ్మెల్యే అనుచరులకే అక్రమ వాటర్ ప్లాంట్లు అధికంగా ఉన్నాయని వాటన్నిటిపై ఎందుకు దృష్టి సారించడం లేదని ప్రశ్నించారు. ఈ విషయంపై స్థానిక బీజేపీ నాయకులు కూడా బిఆర్ఎస్ నాయకులకు సహకరించడం బాధాకరం అని వ్యాఖ్యానించారు. వెంటనే ఉదయ్ వాటర్ ప్లాంట్‌ను తిరిగి ప్రారంభించాలని, లేని పక్షంలో మిగిలిన 40 వాటర్ ప్లాంట్లను కూడా వెంటనే సీజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చని పక్షంలో రానున్న మంగళవారం ఎమ్మార్వో కార్యాలయాన్ని ముట్టడించి పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ఆకుల సతీష్, పులి బలరాం, భీమ్ రాజ్, పున్నా రెడ్డి, శ్రీరాములు, మహేష్, నల్ల జై శంకర్ గౌడ్, సాయి నేత, వసుంధర పాల్గొన్నారు.