శ్రీ సీతారామ నవమి ఉత్సవాలకు ఘన శ్రీకారం
నిజాంపేట (న్యూస్ విధాత్రి), మార్చి 21: శ్రీ సీతారామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేపట్టారు. ఈ సందర్భంగా పందిరి రాకతో ఆలయ పరిసరాలు పండుగ వాతావరణంతో కళకళలాడాయి. మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణోత్సవాలకు శుభారంభం జరిగింది. పందిరి రాట ధ్వజాన్ని ప్రతిష్టించడం ద్వారా ఉత్సవాలకు శ్రీకారం చుట్టగా, పసుపు దంచటం కార్యక్రమంతో అంకురార్పణ జరిగింది.

ఈ పూజా కార్యక్రమాలు సంప్రదాయబద్ధంగా నిర్వహించబడటంతో భక్తుల్లో భక్తి భావం వెల్లివిరిసింది. ఈ కార్యక్రమానికి ప్రాంతీయ భక్తులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రాబోయే రోజుల్లో స్వామివారి కల్యాణోత్సవం, ప్రత్యేక పూజలు, అన్నదానం వంటి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. స్వామివారి కృపా కటాక్షాలతో ప్రారంభమైన ఈ ఉత్సవాలు విజయవంతంగా కొనసాగాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.