సాధారణ దొంగతనం కాదు.. ‘ పందుల’ దొంగతనం…!
• 800 పందుల్లో 70 గల్లంతు…!
• దొంగలు పందులను ఎత్తుకెళ్లారా? పందులే పరారయ్యాయా?
• జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), అక్టోబర్ 8: ఇదేంటి… సాధారణ దొంగతనం కాదు… పందుల దొంగతనం…! అంటున్నారని ఆలోచిస్తున్నారా..? ఇక్కడ పందుల దొంగతనం అంటే పందులు దొంగతనం చేశాయని కాదండీ… పందులనే ఎవరో దొంగతనం చేశారని. ఇక వివరాల్లోకి వెళ్తే…జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంతకుముందెన్నడూ చూడని సంఘటన చోటుచేసుకుంది. జగద్గిరిగుట్ట లోని గురుగోవింద్ సింగ్ కాలనీలో నివాసముండే తారా సింగ్ కుమారుడు దీపక్ సింగ్ ఫ్యాబ్రికేషన్ పనితోపాటు పందుల పెంపకాన్ని చేస్తూ జీవనోపాధి సాగిస్తున్నాడు. ఈ క్రమంలో దీపక్ సింగ్ 800 పందులను పెంచుతున్నాడు. అయితే అక్టోబర్ 1వ తేదీ రాత్రి సుమారు 10 గంటల సమయంలో 70 పందులు ఒకేసారి గల్లంతు కావడంతో అతను అవాక్కయ్యాడు.
దీంతో చుట్టుపక్కల వెతికినా పందుల జాడా కనబడకపోవడంతో మంగళవారం (అక్టోబర్ 7వ తేదీ) జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేశాడు. తనకు అదే ప్రాంతంలో ఉండే కమల్ సింగ్, కరణ్ సింగ్, హర్దీప్ సింగ్, ప్రీతం సింగ్‌లు పందులను ఎత్తుకెళ్లి ఉంటారననే అనుమానాన్ని ఫిర్యాదులో వెల్లడించాడు. దీంతో జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పందులు చోరీ అయ్యాయా? లేక రాత్రి గల్లంతయ్యాయా ? అనే అంశంపై విచారణ కొనసాగిస్తున్నారు.