సోలాపూర్ మున్సిపాలిటీలో మెరిసిన తెలంగాణ తేజం

• కార్పొరేటర్‌గా గెలిచిన తెలంగాణ బిడ్డ గుర్రం సత్యనారాయణ 
హైదరాబాద్ (న్యూస్ విధాత్రి), జనవరి 17: 
మహారాష్ట్రలోని సోలాపూర్ నగరంలో ఇటీవల నిర్వహించిన మున్సిపాలిటీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువ నాయకుడు ఘన విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం లోని పల్లెర్గ గ్రామానికి చెందిన పద్మశాలి బిడ్డ గుర్రం సత్యనారాయణ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థిగా పోటీ చేసి సోలాపూర్ మున్సిపాలిటీ 13వ వార్డు కార్పొరేటర్‌గా విజయం సాధించారు. పల్లెర్ల గ్రామానికి చెందిన గుర్రం రామయ్య కుమారుడైన సత్యనారాయణ వ్యాపార నిమిత్తం గత కొన్నేళ్లుగా మహారాష్ట్రలోని సోలాపూర్ నగరంలో నివసిస్తున్నారు. కుటుంబంతో కలిసి అక్కడే స్థిరపడి, స్థానిక ప్రజలతో సఖ్యతగా మెలుగుతూ వారి సమస్యలపై నిత్యం స్పందిస్తూ ప్రజాసేవలో చురుకుగా పాల్గొంటున్నారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ, స్థానిక సమస్యల పరిష్కారానికి ముందుండటం ఆయనకు ప్రజల్లో మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అలాగే స్వతహాగా దైవభక్తి కలిగిన వ్యక్తిగా సనాతన ధర్మ పరిరక్షణకు అనేక కార్యక్రమాలు నిర్వహించడం కూడా ప్రజల మన్ననను పొందడానికి దోహదపడింది.

నియామక పత్రంతో గుర్రం సత్యనారాయణ

ఈ నేపథ్యాన్ని గమనించిన భారతీయ జనతా పార్టీ నాయకత్వం సోలాపూర్ నగరపాలిక ఎన్నికల్లో ఆయనను 13వ వార్డు అభ్యర్థిగా బరిలోకి దింపింది. ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తున్న సత్యనారాయణపై విశ్వాసం ఉంచిన ప్రజలు ఆయనను ఘన విజయం వైపు నడిపించారు.
తెలంగాణ మట్టిలో పుట్టిన ఒక సాధారణ వ్యాపారవేత్త సోలాపూర్ మున్సిపాలిటీ రాజకీయాల్లో సత్తా చాటడం పల్లెర్ల గ్రామంతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లాకు గర్వకారణంగా మారింది.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More