తిరుగుబాటు ప్రారంభమైందా..
విజయవాడ, ఫిబ్రవరి 5: ఆకాశం బద్దలైందా…? నేల ఈనిందా..? అనే మాటలే గుర్తుకొస్తున్నాయి ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ‘ఛలో విజయవాడ ర్యాలీ’ చూస్తుంటే.. అది జన ప్రభంజనం.. చలిచీమల మాదిరి ప్రభుత్వ ఉద్యోగులు ఛలో విజయవాడకు దండు కట్టారు. జగన్ సర్కార్ కు ముచ్చెమటలు పట్టించారు. సర్కార్ కు దిమ్మదిరిగేలా ఛలో విజయవాడతో సత్తా చాటారు. రోడ్ల మీదకు ఎవరొస్తారో.. ఎలా వస్తారో చూద్దాం అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన ప్రభుత్వ పెద్దల కాళ్ల కింద భూమి కంపించిపోయేలా కదం తొక్కారు. ఛలో విజయవాడ కార్యక్రమం జగన్ సర్కర్ కు కచ్చితంగా ఓ హెచ్చరికే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కొండ చిలువ లాంటి జగన్ రెడ్డి సర్కార్ పై చలిచీమల్లాంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఏకమై చేసిన వార్నింగ్ ఇది అంటున్నారు. రెండున్నరేళ్లుగా వైసీపీ సర్కార్ పై గూడుకట్టుకున్న ఆవేదన, కసితో తిరుగుబాటుకు నాంది పలికారంటున్నారు. జగన్ రెడ్డి సర్కార్ పై విజయవాడలో సమరశంఖం పూరించారంటున్నారు. ఇది ఒక్క ఉద్యోగుల్లోని ఆగ్రహమే కాదు.. రాష్ట్రంలోని ప్రజలందరిలో నెలకొన్న ఆగ్రహావేశాలకు నిదర్శనంగా భావిస్తున్నారు.పాలకులు ధర్మం తప్పితే.. ప్రజల అభీష్టం ప్రకారం నిర్ణయాలు చేయకపోతే ఎలాంటి పరిణామాలు చవిచూడాల్సి వస్తుందో చెప్పేందుకు ఛలో విజయవాడ ఒక ట్రైలర్ మాత్రమే అని.. అసలు సినిమా ఇక ముందు ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.
అత్యధిక మంది ఎమ్మెల్యేల బలంతో విర్రవీగుతూ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ పోతే.. పరిణామాలు ఇలాగే తీవ్రంగా ఉంటాయనేది ఛలో విజయవాడ నిరూపించిందని చెబుతున్నారు.నిజానికి ‘ఛలో విజయవాడ’కు వచ్చిన వారంతా స్వచ్ఛందంగా తరలి వచ్చినవారే. పీఆర్సీ పేరుతో జగన్ సర్కార్ పెట్టిన చిచ్చుతో చిర్రెత్తి, కడుపు మండి వచ్చినవారే. వారికి ఎవరూ బిర్యానీ ప్యాకెట్లు, బీర్లు సప్లై చేయలేదు. బస్సులు పెట్టి తరలించనూ లేదు. పోలీసులు అడ్డుకున్నా ఆగలేదు. ప్రభుత్వ పెద్దల బెదరింపులకూ లొంగలేదు. కొద్ది మంది వస్తే.. పోలీసులు అడ్డుకునే వారేమో.. కానీ ఉప్పెన మాదిరి ఉరకలెత్తి, వెల్లువలా ఆందోళనకారులు వస్తే.. వారిని ఆపడం ఎవరితరం? ఈ సంఘం అని తేడా లేదు.. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆగలేదు.. చివరికి పోలీసులు కూడా ‘ఛలో విజయవాడ’ తమ వంతు పాత్ర పోషించారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చాలా చోట్ల తనిఖీలు, చెక్ పోస్టులు పెట్టినా.. నిర్బంధాలు, అరెస్టులు చేసినా.. చాలా చోట్ల పోలీసులు ఉదాసీనంగా కనిపించారంటున్నారు. తమ తరఫున కూడా మీరే ఉద్యమం చేయండని పోలీసులు సహాయ సహకారాలు అందించినట్లు సమాచారం ఉంది.
ఏదో చేశామన్న పేరుతో ఒకరిద్దర్ని అదుపులోకి తీసుకున్నా పది మందిని వదిలేశారంటున్నారు. పోలీసుల ఉదాసీనత కూడా ఛలో విజయవాడ సక్సెస్ వెనుక కారణం అని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. జనం ఆగ్రహిస్తే.. ఎలాంటి పరిణామాలు ఉంటాయో? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. బ్లూ మీడియాలో కాకుండా విజయవాడలో ఏం జరిగిందో మిగతా మీడియాల్లో చూస్తే అద్వైతం బోధపడుతుందని రాజకీయ విశ్లేషకులు సలహా ఇస్తున్నారు. ఉద్యోగుల నెత్తిన జగన్ సర్కార్ రుద్దిన పీఆర్సీ పుణ్యంతో వారంతా రోడ్డెక్కారు. జీతంలో కోతతో తిరగబడ్డారు. వారి కడుపుమంటను తాడేపల్లి ప్యాలెస్ ను కాల్చేసేలా ఛలో విజయవాడకు తరలివచ్చారనే నిజాన్ని ఒప్పుకుంటారా? ఇప్పటికీ మించిపోయింది లేదు.. పీఆర్సీ జీఓలు వెనక్కి తీసుకోండి.. ఉద్యోగుల న్యాయబద్ధమైన డిమాండ్లు నెరవేర్చండి.. ఉద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వమూ బాగుపడిన దాఖలాలు చరిత్రలో లేవని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇన్నాళ్లూ సామాన్య జనాన్ని చేసినట్లు తిమ్మిని బమ్మిని చేసినట్లు ఉద్యోగ, ఉపాధ్యాయులనూ మభ్య పెట్టాలని చూస్తూ పరిణామాలు ఇలాగే ఉంటాయంటున్నారు. పోరాటంలో ఉన్న టీచర్లు విద్యార్థులకు పాఠాలతో పాటు గుణపాఠాలూ చెబుతారని గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు. ఉద్యోగులకు లెక్కలు తెలుసు.. ఎవరి లెక్కలు ఎలా తేల్చాలో కూడా వారికి బాగా తెలుసని గుర్తుచేస్తున్నారు.