పోలీస్ శాఖలో 317 పరేషాన్

హైదరాబాద్, ఫిబ్రవరి 8: భాగ్యనగరంలో పోలీసులకు కొత్త సమస్య వచ్చిందా? సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలోనూ ఖాకీలకు తిప్పలు తప్పడం లేదా? జీవో 317ను తలుచుకుని ఇన్‌స్పెక్టర్లు.. పోలీస్‌ బాస్‌లు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? ఇంతకీ ఖాకీలకు వచ్చిన పరేషాన్‌ ఏంటి?జీవో 317 సెగ పోలీసులను కూడా తాకింది. కాకపోతే అది నిరసన రూపంలో కాదు. ఆ జీవో ద్వారా భాగ్యనగరానికి వచ్చిన ఎస్సైల ద్వారా. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో దాదాపు 400మంది ఎస్సైలు కొత్తగా వచ్చారు. వీళ్లంతా డిపార్ట్‌మెంట్‌కు కొత్త కాదు. రాజధాని మినహా మిగతా ప్రాంతాల్లో ఎస్సైలుగా పనిచేస్తున్నవారే. కాకపోతే మూడు కీలక కమిషనరేట్ల పరిధిలో పనిచేయడం మాత్రం వారికి కొత్తే. ఇలా ఒకేసారి వచ్చిన 400 మంది ఎస్సైలతో ఉన్నతాధికారులకు పెద్ద చిక్కొచ్చి పడిందటసమస్యలతో పోలీస్‌ స్టేషన్‌ గడప తొక్కిన వారితో ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో.. కరుడు గట్టిన నేరస్థులతో అంతే కఠినంగా వ్యవహరిస్తారు పోలీసులు. కాకపోతే జిల్లాలో పోలీసుల పనితీరుకు.. హైదరాబాద్‌లో పనిచేయడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ప్రజల జీవన విధానం.. నేరాల తీరే దానికి కారణం. జీవో 317 ద్వారా వచ్చిన ఎస్సైలకు ఈ తేడా తెలియక తికమక పడుతున్నారు.

ఛార్జ్‌ తీసుకున్నవారిలో చాలామంది హైదరాబాద్‌కు కొత్త. ఛార్జ్‌ తీసుకున్న పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో క్రైం రేట్‌ ఎలా ఉంటుందో.. జనాల రియాక్షన్‌.. జీవన శైలి తెలియదట. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు పోలీసులపై దురుసుగా ప్రవర్తిస్తారు. కొన్ని సందర్భాలలో ప్రజలు మూకుమ్మడిగా పోలీసుల మీదకు వస్తారు. అలాంటి సందర్భాలలో చిన్నపాటి టెక్నిక్‌తో లా అండ్‌ ఆర్డర్‌ను కంట్రోల్‌లోకి తీసుకొస్తారు సిటీ పోలీసులు. వీటిపై జీవో317పై వచ్చిన ఎస్సైలకు అవగాహన లేదు.ప్రతి సర్కిల్‌ పరిధిలో ఇన్‌స్పెక్టర్‌ ఒక్కరే పాత అధికారి. ఆయన కింద పనిచేసే ఎస్సైలంతా జిల్లాల నుంచి వచ్చిన వారే. పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే వారితో జిల్లాల్లో మాట్లాడినట్టు మాట్లాడటం వల్ల కొత్త సమస్యలు వస్తున్నాయట. స్థానికులతో ఉన్న రిలేషన్స్‌ దెబ్బతింటున్నట్టు కొందరు ఖాకీలు వాపోతున్నారట. దీంతో 317 జీవోపై నగరానికి వచ్చిన ఎస్సైలకు పనినేర్పించే పనిలో పడ్డారట ఇన్‌స్పెక్టర్లు.

సిటీలో అకస్మాతుగా వచ్చే సమస్యల దగ్గర నుంచి పిఎస్ లకు వచ్చే వారితో మాట్లాడే తీరుపై క్లాస్‌ తీసుకుంటున్నారట. ఇన్‌స్పెక్టర్లు చెప్పిన తర్వాత అర్థం చేసుకున్నవాళ్లు చేసుకుంటున్నారు.. లేనివాళ్లు డ్యూటీలో ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది.సార్‌ ఇలా చేయండి అని కానిస్టేబుళ్లు ఎస్సైలకు చెప్పలేరు. అలాగని.. ప్రతి సమస్యను ఎస్సైలు ఇన్‌స్పెక్టర్ల దగ్గరకు తీసుకెళ్లలేరు. బాధితులు.. పరిచయస్తులు పదేపదే ఇన్‌స్పెక్టర్ల దగ్గరకు వెళ్లే వెసులుబాటు ఉండదు. దాంతో సమస్యను ఎలా డీల్‌ చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారట స్థానికంగా ఉండే పోలీస్‌ బాస్‌లు. ఇటీవల కాలంలో జరిగిన కొన్ని ఘటనలపై డిపార్ట్‌మెంట్‌లోనే ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అవి పోలీస్‌ ఉన్నతాధికారుల వరకు వెళ్లినట్టు సమాచారం. దీంతో ఈ సమస్యకు ఒక పరిష్కారం కనుగొనే పనిలో ఉన్నారట బాస్‌లు. హైదరాబాద్, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో జీవో 317పై వచ్చిన ఎస్సైలకు ఓరియంటేషన్‌ క్లాస్‌లు తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నారట. ఇప్పటికే కొందరికి పోలీస్‌ ఉన్నతాధికారులు తమదైన శైలిలో తలంటినట్టు తెలుస్తోంది. మరి.. ఈ సమస్యను ఎప్పటిలోగా ఖాకీలు అధిగమిస్తారో చూడాలి.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More