సింగరేణిలో గులాబీ వర్సెస్ కమలం
హైదరాబాద్, ఫిబ్రవరి 8: బడ్జెట్ మీద నిన్నటిదాకా బీజేపీపై విరుచుకుపడిన టీఆర్ఎస్ తాజాగా సింగరేణి అంశాన్ని ఎత్తుకుంది. సింగరేణిని కేంద్రం ప్రైవేటీకరిస్తోందని ఆరోపిస్తూ కేటీఆర్ కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి ఘాటు లేఖ రాశారు. దాన్ని మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసుకునేలా చేశారు. ఇటీవల కేంద్రం నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయాలని నిర్ణయించింది. వాటిని సింగరేణికి కేటాయించకపోవడం అంటే ప్రైవేటీకరణకు తొలి మెట్టు అని.. ఇలాంటి వాటిని తాము సహించబోమని కేటీఆర్ చెప్పారు. కేటీఆర్ కేంద్రమంత్రికి రాసిన లేఖ… కాస్త ఘాటు పదాలతోనే ఉంది. నేడో రేపో సింగరేణిని వేలం వేసేస్తున్నారన్నట్లుగా కేటీఆర్ లేఖ సంధించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు కావల్సిన ఐరన్ ఓర్ గనులు ఇవ్వకుండా నష్టాలకు గురిచేసిన కేంద్రం దాన్ని ప్రయివేటీకరించేందుకు రంగం సిద్దం చేసిందన్నారు. ఇలాంటి కుట్రలనే సింగరేణిపై ప్రయోగించేందుకు రంగం సిద్దం చేస్తున్నదని అందోళన వ్యక్తం చేశారు. సింగరేణి అంటే కోల్ మైన్ మాత్రమే కాదని యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే గోల్డ్ మైన్ అని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు.
నాలుగు బ్లాకులు మాత్రమే వేలం వేయడం లేదని, వేలాది మంది కార్మికుల భవిష్యత్తును బహిరంగ మార్కెట్ లో వేలం వేస్తోందని కేటీఆర్ విమర్శించారు. తక్షణం వేలం ఆపాలన్నారు. కేటీఆర్ లేఖపై బీజేపీ ఉలిక్కి పడింది. బొగ్గు బ్లాకుల వేలం సహజంగానే జరుగుతోందని సింగరేణికి ఏం సంబంధం అని ప్రశ్నించారు. గతంలో ఒడిషాలో తొమ్మిది బ్లాకుల్ని తెలంగాణ వేలంలో దక్కించుకుందన్నారు. అనవసరంగా సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నాలు కేటీఆర్ చేస్తున్నారని బీజేపీ విమర్శించింది. రూ.20 వేల కోట్లను దారి మళ్లించి సింగరేణిని కేసీఆర్ దివాలా తీయిస్తోంది కేసీఆరేనని.. దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు సంస్థలో 62 వేల మంది కార్మికులుంటే ఇప్పుడు 40 వేల మందే ఉన్నారన్నారు. బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ పోరాటంలో వారానికో కొత్త అంశంతో ఫైట్ లైవ్‌లో ఉండేలా చూసుకోవడంలో రెండు పార్టీలు సక్సెస్ అవుతున్నాయని అనుకోవచ్చు.