16న కమలంలోకి యువ తెలంగాణ

హైదరాబాద్, ఫిబ్రవరి 9: యువ తెలంగాణ పార్టీ విలీనం ఖరారైంది. ఈనెల 16న ముహుర్తం ఫిక్స్ అయింది. కేంద్రమంత్రుల సమక్షంలో ఆ పార్టీ విలీనం కాబోతుంది. 30వేల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మూడేళ్లుగా తెలంగాణ ప్రజాసమస్యలపై కొట్లాడిన పార్టీ బీజేపీలో విలీనం అవుతోంది.యువ తెలంగాణ పార్టీని 2018లో జిట్టా బాలకృష్ణారెడ్డి స్థాపించారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా రాణిరుద్రమదేవి వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలోని ఉమ్మడి పదిజిల్లాలకు అధ్యక్షులను నియమించి ప్రజాసమస్యలపై ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. పార్టీ స్థాపనకు ముందు 2009లో ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో యువతెలంగాణ జేఏసీని ఏర్పాటు తెగదెంపులు సంగ్రామ సభలు నిర్వహించింది. టీఆర్ఎస్ పార్టీతో పాటు పనిచేసింది. వివేకానంద స్ఫూర్తితో ఉద్యమం కొనసాగించారు. అయితే 2009లో కేసీఆర్‌ను విబేధించి భువనగిరి అసెంబ్లీ స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా జిట్టా పోటీ చేసి 44వేల ఓట్లతో, 2014 ఎన్నికల్లో 40ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. 2018 ఎన్నికల్లో యువ తెలంగాణ పార్టీని స్థాపించి బీజేపీ మద్దతుతో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2021లో పార్టీ తరుపుణ రాణి రుద్రమదేవి పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయారు.అయితే జాతీయ పార్టీలతోనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని భావించి యువతెలంగాణ పార్టీ నేతలు ఆపార్టీని విలీనం చేసేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగానే ఈ నెల 16న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్రమంత్రుల సమక్షంలో ఆపార్టీ నేతలు కమలం కండువా కప్పుకోబోతున్నారు.

అయితే వేదిక మాత్రం ఇంకా ఖరారు కాలేదు. 30వేల మందితో హైదరాబాద్‌లో నిర్వహించాలని భావిస్తున్నప్పటికీ భువనగిరిలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేసి చేరాలని జిట్టా భావిస్తున్నారు. కరోనా నేపథ్యం, యూపీ ఎన్నికల ప్రచారం ఉండటంతో కేంద్రమంత్రులు ఇచ్చే అపాయింట్ మెంట్‌ను బట్టి ఢిల్లీలోనా,లేక హైదరాబాద్‌లోనా అనేది రెండ్రోజుల్లో ఖరారు కానుంది. వేలాదిమంది అనుయాయులు, కార్యకర్తలు, అభిమానులతో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి 10 జిల్లాలకు చెందిన పార్టీ అధ్యక్షులతోపాటు పూర్తి కమిటీ సభ్యులు చేరనున్నారు.ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్దేశ్యం నెరవేరలేదని, జాతీయ పార్టీలతోనే లక్ష్యం నెరవేరుతుందని, ప్రజలు కన్న కలలు నిజం చేయాలనే లక్ష్యంతో యువ తెలంగాణ పార్టీని విలీనం చేస్తున్నట్లు యువ తెలంగాణ పార్టీ నేతలు తెలిపారు. నీళ్లు నిధులు, నియామకాలు జరుగలేదని, అన్ని విషయాల్లో టీఆర్ఎస్ అట్టర్ ప్లాప్ అయిందని పేర్కొన్నారు. ఉద్యమానికి యూనివర్సిటీ విద్యార్థులు ఫిల్లర్లు అయినప్పటికీ వారికి ఉద్యోగాలు కల్పించడంలో కేసీఆర్ విఫలమయ్యారని, భూముల రేట్లు పెరిగాయి తప్పా ఆర్థిక పరిస్థితుల్లో మార్పులేదని, విద్యావైద్యరంగం కూదేలైందని మండిపడ్డారు.

నిధులు, భూదోపిడీని అడ్డుకోవడానికే జాతీయ పార్టీ బీజేపీలో పార్టీ విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను ఓడించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. కేసీఆర్ వైఫల్యాలను ప్రజలకు వివరించి హక్కుల సాధనకు వారితో కలిసి పనిచేస్తామని పేర్కొంటున్నారు. పథకాల పేరుతో కేసీఆర్ దండుకుంటున్నారని ఆరోపించారు.బీజేపీ తెలంగాణలో బలపడుతుంది. దీంతో ఆ పార్టీతోనే టీఆర్ఎస్‌ను ఎదుర్కోవడమే లక్ష్యంతో జిట్టా బీజేపీలో చేరుతున్నారు. అందులో భాగంగానే రాబోయే ఎన్నికల్లో భువనగిరి ఎంపీ టికెట్, రుద్రమదేవికి ఇబ్రహీంపట్నం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు సమాచారం. బీజేపీతో కమిట్ మెంట్‌తో పార్టీని విలీనం చేస్తున్నట్లు సమాచారం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో కేంద్రమంత్రుల సమక్షంలో చేరుతున్నట్లు తెలిసింది.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More