కొత్త జిల్లాల్లో మూడింటికి ముగ్గురు మహనీయుల పేర్లు మరువకండి
కృష్ణా జిల్లా కలెక్టర్లకు అమరావతి బహుజన జెఎసి వినతి
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా పెంపు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కర్నూలు జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరును, నరసరావుపేటకు కవిసామ్రాట్ గుర్రం జాషువా పేరును, ప్రజా రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన 29 గ్రామాలు ఉన్న కొత్త జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని పలు దళిత, బహుజన సంఘాలు కోరాయి. మంగళవారం అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ఆధ్వర్యంలో విజయవాడలో కృష్ణా జిల్లా కలెక్టర్ జె. నివాస్ ను స్వయంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ముగ్గురు మహానీయుల పేర్లు పెట్టేందుకు అవసరమైన నేపథ్యాన్ని బాలకోటయ్య కలెక్టర్ కు వివరించారు. 38 ఏళ్ళ అతి చిన్న వయసులోనే దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రిగా ప్రసిద్ధి చెందిన దామోదరం సంజీవయ్య రాష్ట్రానికి, దేశానికి చేసిన సేవలు అనిర్వచనీయం అని చెప్పారు.
తెలుగు సాహిత్యంలో మహాకవిగా పేరొందిన కవి సామ్రాట్ గుర్రం జాషువా అణచివేత లపై, అవమానాల పై తిరుగుబావుటా ఎగరేశారని, ఛీత్కారాలపై పోరాడి సత్కారాలు పొందిన కవి గా అభివర్ణించారు. ప్రజా రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన 29 గ్రామాలు కలిసి ఉన్న కొత్త జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు సముచితమైనది అని చెప్పారు.అమరావతిలో బుద్ద భగవానుని చారిత్రక సాక్ష్యాలు ఉన్నాయని, గత ప్రభుత్వం అమరావతిలో అంబేద్కర్ స్మృతివనంకు 30 ఎకరాలు కేటాయించిందని, ప్రస్తుత ప్రభుత్వం అమరావతి సమీపంలోని విజయవాడలో 130 అడుగుల చారిత్రాత్మక అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నదని పేర్కొన్నారు. ఈ మహనీయుల నేపథ్యాన్ని పురస్కరించుకొని మూడు జిల్లాలకు మూడు పేర్లు పెట్టాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కలెక్టర్ ద్వారా వినతి పత్రం సమర్పించినట్లు బాలకోటయ్య చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ చైర్మన్ పేరు పోగు వెంకటేశ్వరరావు, కోస్తాంధ్ర సమితి అధ్యక్షులు సర్వేపల్లి సుదర్శన్ రావు, బహుజన జెఎసి ప్రధాన కార్యదర్శి శిరంశెట్టి నాగేంద్ర రావు, కృష్ణ బాబు, శ్రీనివాసరావుతదితరులు పాల్గొన్నారు.