ఏపీ ప్రభుత్వంతో 3 కీలక ఒప్పందాలు

పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
దుబాయ్, ఫిబ్రవరి,16: ఏపీ ప్రభుత్వంతో 3 కీలక ఒప్పందాలు జరిగినట్లు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. మంత్రి మేకపాటి సమక్షంలో వివిధ రంగాలకు చెందిన పరిశ్రమల ప్రతినిధులు ఏపీఐఐసీ ఎండీ జవ్వాది సుబ్రమణ్యం ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి మార్చుకున్నారు. తాజ్ బిజినెస్ బే హోటల్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో సోమవారం “దుబాయ్ ఇన్వెస్ట్ మెంట్ రోడ్ షో” జరిగింది. అన్ని రంగాల పెట్టుబడులకు అవకాశం గల రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని మంత్రి గౌతమ్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. సహజవనరులు, సకల సదుపాయాలు పుష్కలంగా కలిగిన ఏపీలో పెట్టుబడులు పెట్టి పారిశ్రామిక వేత్తలకు పిలుపునిస్తూ “యూ గ్రో వి గ్రో” అన్న ఆంధ్రప్రదేశ్ నినాదాన్ని మంత్రి మేకపాటి వినిపించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు గల అవకాశాలపై ఏపీ ప్రభుత్వం ప్రదర్శించిన వీడియో పారిశ్రామికవేత్తలను ఆకర్షించింది.

దుబాయ్ ఎక్స్ పో 2020 పర్యటనలో భాగంగా పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి నేతృత్వంలోని పరిశ్రమల అధికారుల బృందం సోమవారం మూడు కీలక ఎంవోయూలను కుదుర్చుకుంది. రెండు జీ2బీ, ఒక బీ2బీ తరహా అవగాహన ఒప్పందాలు చేసుకుంది. లండన్ కు చెందిన కాజస్ ఈ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో రూ.3వేల కోట్ల విలువైన ఎంవోయూ చేసుకుంది. రూ.150 కోట్ల విలువైన 25 రీటైల్ ఔట్ లెట్ల ఏర్పాటుకు ముందుకొచ్చిన రీజెన్సీ గ్రూప్ కూడా ఎంవోయూ కుదుర్చుకుంది. రీటైల్ వ్యాపారంలో గ్రాంట్ హైపర్ మార్కెట్ బ్రాండ్ నేమ్ తో 25 సంవత్సరాలుగా సత్తా చాటుతున్న రీజెన్సీ గ్రూప్ తో జీ2బీ (గవర్నమెంట్ టు బిజినెస్) ఏపీ ఒప్పందం చేసుకుంది. అనంతపురం, కడప, కర్నూలు, మదనపల్లి,చిత్తూరు, నెల్లూరు, హిందూపురం ప్రాంతాలలో పంపిణీ కేంద్రాలు, స్పైసెస్ అండ్ పల్సెస్ ప్యాకేజీ యూనిట్లను ఏర్పాటు చేయనుంది.

యూఏఈ రీటైల్ సంస్థల ఒప్పందంతో ఆంధ్రప్రదేశ్ రీటైల్ వాణిజ్యం మరింత ముందడుగు పడింది. విశాఖలోని “ఫ్లూయెంట్ గ్రిడ్” అనే ఎస్సార్ ఇన్వెస్ట్ మెంట్ గ్రూప్ లో భాగమైన ట్రోయో జనరల్ ట్రేడింగ్ సంస్థతో బీ2బీ ఎంవోయూ జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించిన ఏఐ అండ్ ఎంఎల్ టెక్నాలజీస్ పేరుతో విశాఖలో కొత్తగా 300 హైఎండ్ ఐ.టీ ఉద్యోగాలిచ్చే దిశగా ఒప్పందం కుదిరింది. ఎస్సార్ గురేర్ ఇన్వెస్ట్ మెంట్ గ్రూప్ బోర్డు సభ్యులు మాజీదల్ గురేర్ , ఫ్లూయెంట్ గ్రిడ్ సంస్థకు చెందిన సమయ్ మంగళగిరి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి మార్చుకున్నారు. ప్రజా రవాణాకు సంబంధించిన డీజిల్ వాహనాలను తీర్చిదిద్దే పరిశ్రమను వైఎస్ ఆర్ కడప జిల్లా జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ లో ఏర్పాటు చేయడానికి మరో పరిశ్రమ ముందుకు వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకుంది. ఒప్పంద పత్రాలను మార్చుకున్న ఏపీఈడీబీ సీఈవో సుబ్రమణ్యం జవ్వాది, కాజస్ కంపెనీ ఎండీ రవికుమార్ పంగా ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. తాజ్ బిజినెస్ బే హోటల్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం “దుబాయ్ ఇన్వెస్ట్ మెంట్ రోడ్ షో” విజయవంతంగా ముగిసింది.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More