కేసీఆర్ వ్యూహాత్మక తప్పటడుగులేనా..?

హైదరాబాద్, ఫిబ్రవరి 23: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ఓ గొప్ప రాజకీయ వ్యూహ కర్త. అంతే కాదు,రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే సూత్రాన్ని చాలా చక్కగా వంట పట్టించుకున్న నాయకుల్లో అయన ముందు వరసలో ఉంటారు. నిజానికి, ఇన్నయ్య మొదలు ఈటల దాకా నడిచిన చరిత్రను చూస్తే, శాశ్వత మిత్రులు ఉండరు కాదు, ఉండ’కూడదు’ అనేదే కేసీఆర్ నిశ్చితాభిప్రాయం అనిపిస్తుంది. అందుకే,ఎవరిని, ఎప్పుడు, ఎలా వాడుకోవాలో, ఎవరిని, ఎప్పుడు, ఎలా వదిలేయాలో, ఆయనకు తెలిసినంతగా మరొకరికి తెలియదని అంటారు. ఇందుకు ఓ వందావెయ్యి ఉదాహరణలు మన కళ్ళముందే ఉన్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో కోదండ రామ్’ను కేసీఆర్’ ఎంతలా ఉపయోగించుకున్నారో, రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిస్థితి ఏమిటో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. నిజానికి, తెలంగాణ ఉద్యమంలో, కోదండ రామ్’ సారధ్యంలో జేఏసీ ఏర్పాటు ఒక టర్నింగ్ పాయింట్. జేఏసీనే లేకుంటే,కేసేఆర్ కూడా కాడివదిలేసే వారని అప్పట్లో ఆయనతో సన్నిహితంగా మెలిగిన నాయకులు ఇప్పటికి కూడా చెపుతూనే ఉన్నారు.అయితే, జేఏసీ ఏర్పాటు కోదండ రామ్ ఆలోచన కాదు. అది కేసీఆర్ ఆలోచనే, జేఏసీ కేసేఅర్ మానస పుత్రిక. ఆయన ముందు చూపు వ్యూహంలో భాగం. అందులో సందేహం లేదు. కానీ, అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, చివరకు ఏ సంబంధం లేని మేథావులు జేఏసీలో భాగస్వాములు అయ్యింది మాత్రం కోదండ రామ్ కారణంగానే అనేది కాదనలేని నిజం. కోదండ రామ్’కు కేసేఅర్’ కున్న పొలిటికల్ అంబిషన్స్ లేవు కాబట్టే ఇతర పార్టీలు ఆయన నాయకత్వాన్ని సులభంగా అంగీకరించాయి ఆ విధంగా ఒక రాజకీయ నాయకుడిగా, కేసీఆర్ తనంతట తానుగా చేయలేని కార్యాన్ని,అప్పటికి రాజకీయ వాసనలు అంతగా లేని కోదండ రామ్’ రెడ్డి ద్వారా కానిచ్చారు.

ఆ తర్వాత ఏమి జరిగింది అనేది చరిత్ర. ఇప్పుడు, కేసేఆర్ అప్పుడు విజయవంతమైన అదే పాత ట్రిక్కును/ఫార్ములాను మళ్ళీ ప్రయోగిస్తున్నారా, అంటే, ముంబైలో ప్రకాష్ రాజ్’ ఎంట్రీ ఇవ్వడం అందుకు సంకేతమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నిజానికి, దేశంలో ప్రస్తుతమున్నరాజకీయ పరిస్థితుల్లో 2024 ఎన్నికలకు ముందు ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పడే అవకాశం లేదని అందరికీ తెలుసు.అలాగే,ఎన్నికలకు ముందుగానీ, ఎన్నికల తర్వాత కానీ, కాంగ్రేస్ లేని బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు అయినా, ఫలితం ఉండదు.ఒకటీ రెండు కాదు ఏకంగా 200 లోక్ సభ స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యనే పోటీ ఉంటుంది. అంతే కాదు ప్రాతీయ పార్టీల ప్రాబల్యం ఉన్న మరికొన్ని రాష్ట్రాల్లోనూ, అలాగే, బీజేపీ ముక్త కేరళలో కాంగ్రెస్ పార్టీ, వామ పక్షాల మధ్యనే ప్రధాన పోటీ ఉంటుంది. అంతేకాదు,కాంగ్రెస్ పార్టీ ఎంతగా కుదేలైనా, వందకు పైగా లోక్ సభ స్థానాలు గలిచే సత్తా ఉన్న బీజీపీ యేతర పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ఒక్కటే. ఇది కూడా అందరికీ తెలిసిన విషయమేమరి అందరికీ తెలిసన విషయం కేసీఆర్’కు తెలియదా అంటే, రాజకీయ చదరంగంలో అందరికంటే నాలుగు అడుగులు ముందుంటే ఆయనకు ఈ చిన్ని సూక్ష్మం తెలియకుండా ఉండే అవకాశమే లేదు. అయినా,అది అయ్యేది కాదని తెలిసినా ఆయన ప్రాంతీయ పార్టీల కూటమి అంటూ బయలుదేరారు అంటే, అది ఎంతో ఆలోచించి వేసిన అడుగే కానీ, అనాలోచిత ప్రయత్నం కాదని కొంచెం ఆలస్యంగానే అయినా విశ్లేషకులు గుర్తిస్తున్నారు. నిజానికి, కేసీఆర్, జాతీయ రాజకీయాల లక్ష్యం ఇప్పటి కిప్పుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడం కాదు.

లోక్ సభ ఎన్నికల కంటే ముందుగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పాస్ మార్కులు తెచ్చుకోవడమే ఇప్పుడు అయన ముందున్న లక్ష్యం. అసెంబ్లీ ఎన్నికల గండం గట్టెక్కాలంటే, కాంగ్రెస్’తో పాటు బీజేపీని టార్గెట్ చేయక తప్పదు. బీజేపీని రాష్ట్రంలో కానీ, జాతీయ స్థాయిలో కానీ, టార్గెట్ చేయాలంటే, కేసీఆర్’కు, అవసరార్ధం బీజేపీని వ్యతిరేకించే స్టాలిన్, మమత, ఉద్ధవ్ థాకరే వంటివారు సరిపోరు బీజీపీని సిద్దాంత పరంగా వ్యరికించే వాయిస్ అవసరం. అందుకే, ప్రకాష్ రాజ్’ ను కేసీఆర్ తెర మీదకు తెచ్చారు. ప్రకాష్ రాజ్’తో కేసీఆర్ ముఖ్యంగా, బీజేపే ప్రధాన అజెండా హిందుత్వను సమర్ధ వంతంగా తిప్పి కొట్టాలంటే, నర నరాన,కణ కణాన హిందూ వ్యతిరేకతను నింపుకున్నప్రకాష్ రాజ్ కంటే మేలైన ఛాయిస్ మరొకరు ఉండరు. ఉద్యమ సమయంలో ఎలాగైతే కోదండ రామ్’ రాజకేయేతర ముద్రను ఉపయోగించుకున్నారో, అదే విధంగా ప్రకాష్ రాజ్’ను హిందూ వ్యతిరేక లౌకికవాద ‘ఐకాన్’ గా నిలబెట్టి, ఇటు రాష్ట్రంలో అటు జాతీయ స్థాయిలో ఉపయోగించుకునేందుకే ఆయన్ను, తన వాడిగా మీడియా ముందుంచారు. అంతే, కాదు ఇంకొందరు ప్రకాష్ రాజ్’లు, కూడా క్యూ’లో ఉన్నారని అంటున్నారు. ముంబైలో ప్రకాష్ రాజ్’కు ఎంట్రీ ఇచ్చినట్లుగానే,  నారాయణ ఖేడ్ పర్యటనలో సీనియర్ జర్నలిస్ట్ ఒకరు…కేసీఆర్ వెనక స్టేజి మీద కనిపించారు. అంటే … ప్రకాష్ రాజ్’ లు ఇంకా ఉన్నారు.అయితే ప్రకాష్ రాజ్’ వంటి హిందూ వ్యతిరేకులే కానవసరం లేదు. ఎవరి టాలెంట్’ను బట్టి వారిని ఉపయోగించుకోవడం, అవసరం తీరిపోయిన తర్వాత తుంచేయడం కేసీఆర్’కు వెన్నతో పెట్టిన విద్య. సో.. కేసీఆర్ వ్యూహత్మకంగానే అడుగులు వేస్తున్నారు.తొందరపడి కేసేఆర్’ వ్యూహాలను తక్కువగా అంచనావేస్తే వేస్తే.. తప్పులో కాలేసినట్లే అవుతుందని అంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More