చేతిలో డబ్బులు ఖాళీ.. ఇండియాలో కిడ్నాప్ డ్రామా

ఇండియాకు వచ్చిన ఓ అమెరికా పౌరురాలు చేతిలో డబ్బులు నిండుకోవడంతో కిడ్నాప్ డ్రామాకు తెరదీసింది. ఢిల్లీలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. యూఎస్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన క్లోయ్ మెక్లాఫ్లిన్ (27) మే 3న ఢిల్లీ వచ్చింది. వాషింగ్టన్ డీసీలో ఉండే ఆమె తండ్రి మాజీ ఆర్మీ అధికారి. ఈ నెల 7న క్లోయ్ తన తల్లికి ఫోన్ చేసి తెలిసిన వ్యక్తే ఒకరు తనను కిడ్నాప్ చేసి హింసిస్తున్నాడని చెప్పింది. అయితే, ప్రస్తుతం తానెక్కడున్నదీ చెప్పలేదు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఆమె తల్లి భారత్‌లోని అధికారులను సంప్రదించింది. మరోవైపు, సమాచారం అందుకున్న అమెరికా రాయబార కార్యాలయం కిడ్నాప్ విషయాన్ని ఢిల్లీ పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. ఈ నెల 10న మెక్లాఫ్లిన్ మరోమారు తన తల్లికి వాట్సాప్ ద్వారా వీడియో కాల్ చేసింది. ఆమె వివరాలు చెప్పేలోగానే ఓ వ్యక్తి ఆమె గదిలోకి రావడంతో కాల్ కట్ అయింది.

దీంతో టెక్నికల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి ఆమె ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నించారు. అలాగే, ఆమె తన ఇమ్మిగ్రేషన్ డాక్యుమెంట్‌కు సంబంధించి అమెరికన్ సిటిజన్ సర్వీస్‌కు ఈ-మెయిల్ పంపేందుకు ఉపయోగించిన ఐపీ అడ్రస్ కోసం యాహూ (Yahoo.com)ను సంప్రదించి సాయం కోరారు. దీంతోపాటు బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్‌ను సంప్రదించి ఆమె వారికి ఇచ్చిన చిరునామాను సంపాదించారు. ఆ తర్వాత ఆమె బసచేసినట్టు అనుమానించిన హోటల్‌పై పోలీసులు దాడులు నిర్వహించారు. అయితే, ఆ పేరుతో ఎవరూ హోటల్‌లో దిగలేదని అక్కడి సిబ్బంది పోలీసులకు తెలిపారు. దీంతో, ఆమె తన తల్లికి కాల్ చేసినప్పుడు వై-ఫై ఉపయోగిస్తున్నట్టు గుర్తించిన పోలీసులు.. ఆ ఐపీ చిరునామాతో పనిచేస్తున్న మొబైల్ నెట్‌వర్క్‌ను ట్రాక్ చేశారు. దాని ఆధారంగా గురుగ్రామ్‌లోని నైజీరియన్ జాతీయుడైన ఒకోరోపోర్ చిబుయికే ఒకోరు (31) వద్దకు వెళ్లిన పోలీసులకు అసలు విషయం తెలిసింది.

ఆమె గ్రేటర్ నోయిడాలో ఉందని చిబుయికే పోలీసులకు చెప్పాడు. అతడిచ్చిన సమాచారం మేరకు మెక్లాఫ్లిన్‌ను ట్రాక్ చేసి అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను విచారించగా, ఢిల్లీకి వచ్చిన కొన్ని రోజులకే తనవద్ద డబ్బులు అయిపోయాయని, దీంతో తల్లిదండ్రుల నుంచి డబ్బులు రాబట్టేందుకు కిడ్నాప్ డ్రామా ఆడినట్టు అంగీకరించింది. ప్రియుడు ఒకోరోతో కలిసి ఈ పథకం వేసినట్టు చెప్పడంతో పోలీసులు షాకయ్యారు. ఆమె పాస్‌పోర్టు గడువు ఈనెల 6నే ముగిసిందని, ఆమె ప్రియుడి పాస్‌పోర్టుకు కూడా కాలం చెల్లిందని పోలీసులు తెలిపారు. భారత్ రావడానికి ముందే ఒకోరోతో ఆమెకు పరిచయం ఏర్పడిందని, అతడితో కలిసి ఉండేందుకే ఆమె ఇక్కడికి వచ్చిందని వివరించారు. సింగింగ్‌పై మక్కువే వారిద్దరూ స్నేహితులు కావడానికి కారణం అయి ఉంటుందన్నారు. కాగా, చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్టు, వీసా లేకుండా దేశంలో ఎక్కువ కాలం ఉన్నందుకు గాను వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్టు పోలీసులు తెలిపారు.
New Delhi, USA, US Woman, Kidnap, Us embassy in delhi

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More