~ 1160 లీటర్ల మోనోక్రోటో పాస్, గ్లైఫోసెట్
~ 3 మొబైల్ ఫోన్లు, వాహనం స్వాధీనం
~ రూ 20 లక్షలు విలువచేసే రసాయనాలు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), సెప్టెంబర్ 6: నకిలీ క్రిమిసంహారక మందులు విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను బాలనగర్ ఎస్ఓటి, జీడిమెట్ల పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా నర్సాపూర్ రోడ్ లో దాడి నిర్వహించి వారిని అరెస్టు చేసిన సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 4వ తేదీన చోటు చేసుకుంది. ఈ మేరకు బాలానగర్ డిసిపి శ్రీనివాసరావు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మంగళవారం వివరాలు వెల్లడించారు. అమాయకులైన రైతులను మోసం చేసి నకిలీ పురుగుమందులు, విత్తనాలు విక్రయిస్తున్న వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వనస్థలిపురం ప్రాంతానికి చెందిన బిల్లిపల్లి నరేందర్రెడ్డి (35)కు అబ్దుల్లాపూర్మెట్ లో అగారియా క్రాప్స్ సైన్సెస్ పేరుతో బయో పెస్టిసైడ్స్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలంలోని గూడవల్లి ప్రాంతానికి చెందిన దాసరి వెంకటేశ్వరరావు (52) నరేందర్ రెడ్డి వద్ద డిస్ట్రిబ్యూటర్ గా ఉంటూ నకిలీ పురుగుమందుల మార్కెటింగ్ చేసి విక్రయిస్తున్నాడు. వనస్థలిపురం లోని కమలానగర్ కు చెందిన కొరకుల రాజు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ముగ్గురు కలిసి కొంతకాలంగా నిషేధిత గ్లైపోసిట్, మోనోక్రోటోపాస్ రసాయనాలను వివిధ రకాల బ్రాండ్ల నకిలీ స్టిక్కర్లను అతికించి రైతులకు విక్రయిస్తూ డబ్బులను అక్రమంగా సంపాదిస్తున్నారు.
ఈనెల 4వ తేదీన అబ్దుల్లాపూర్మెట్ నుండి బాలానగర్ మీదుగా నర్సాపూర్ రోడ్ లో నర్సాపూర్ తరలిస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు వాహనం పై దాడి చేసి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తరలిస్తున్న వాహనం (TS 07 UK 4482) సీజ్ చేసి వారి వద్ద నుండి 1160 లీటర్ల మోనోక్రోట్ పాస్, గ్లైఫోసెట్ రసాయనాలు, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్ కు తరలించారు. వాటి విలువ సుమారు రూ 20 లక్షల వరకు ఉంటుందని డిసిపి శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఆపరేషన్ లో పాల్గొన్న బాలానగర్ ఎస్ఓటి అడిషనల్ డిసిపి శోభన్, ఇన్స్పెక్టర్ రాహుల్, వ్యవసాయ శాఖ అధికారులులను, జీడిమెట్ల సిఐ పవన్, పోలీసు సిబ్బందిని డిసిపి అభినందించారు.